
ఫిజౌ (చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండోరోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకోగా, మాజీ చాంపియన్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ జాతీయ చాంపియన్ హెచ్‌ఎస్ ప్రణయ్ రెండోరౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ నెం.2 సింధు 21–15, 21–13తో హాన్ యుయు (చైనా)పై అలవోకగా గెలుపొందింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సింధు 40 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించింది. క్వార్టర్స్‌లో సింధు క్వాలిఫయర్ గావో ఫాంగ్జితో తలపడుతుంది. మరోవైపు తాజాగా జాతీయ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సాధించి మంచి ఫామ్‌లో ఉన్న సైనా నెహ్వాల్ బలమైన ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది.
మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సైనా 18–21, 11–21తో ఐదో సీడ్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌లో 11–9తో ఆధిక్యాన్ని ప్రదర్శించిన సైనా తర్వాత వెనుకబడింది. యామగుచి వెంటవెంటనే పాయింట్లు సాధిస్తూ 21–18తో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. తొలి గేమ్‌ను కోల్పోయిన సైనా రెండోగేమ్‌లోనూ పుంజుకోలేకపోయింది. కేవలం 31 నిమిషాల్లోనే సైనాను ఓడించి యామగుచి క్వార్టర్స్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లోనూ ప్రపంచ నెం.11 ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 19–21, 17–21తో చౌక్ యు లీ (హాంకాంగ్) చేతిలో 42 నిమిషాల్లో పోరాడి ఓడిపోయాడు. సైనా, ప్రణయ్ ఓడిపోవడంతో ఈ టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే బరిలో మిగిలింది. మరోవైపు ఈ టోర్నీలో ఓడినా గురువారం ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం మెరుగు పర్చుకొని 10వ ర్యాంకు చేరుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment