మురళి ముందంజ
హైదరాబాద్: రాకెట్ బాల్ టోర్నమెంట్‌లో నరుమంచి మురళి, రాజ్ మోహన్ ముందంజ వేశారు. స్క్వాష్ తరహాలో జరిగే ఈ పోటీలు భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.
ల్యాంకోహిల్స్‌లోని క్లబ్ జీయస్‌లో శనివారం జరిగిన తొలి రౌండ్ పోరులో మురళి 5-15, 15-9, 11-6తో వెంకటేశ్ బాగల్‌పై గెలుపొందగా, రాజ్‌మోహన్ 15-5, 15-4తో అవసరాల శ్రీనివాస్‌పై విజయం సాధించాడు. ప్రారంభ కార్యక్రమంలో భారత రాకెట్ బాల్ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ కందడాయి మాట్లాడుతూ ‘ల్యాంకోహిల్స్ ఇండియా ఓపెన్’ పేరిట జరుగుతున్న ఈ టోర్నమెంట్ ఇతర క్రీడల్లాగే ప్రాచుర్యం పొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో మొత్తం 40 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
నెట్స్ ఉండవ్... స్క్వాష్ కాదు...
ఆటగాళ్లు రాకెట్లతో బరిలోకి దిగుతారు. కానీ బ్యాడ్మింటన్ కాదు... టెన్నిస్ కానే కాదు... అసలు నెట్సే వుండవు. అలాగని స్క్వాష్ కూడా కాదు. స్క్వాష్ ఆటలాగే అనిపించినా కాస్త భిన్నంగా పోటీ సాగుతుంది. స్క్వాష్‌లో గోడకు లైన్ ఉంటుంది. దానిపైనే బంతిని కొట్టాలి. లేదంటే ఔట్ బాల్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ లైనే ఉండదు. గోడపై ఇష్టమొచ్చిన చోట కొట్టుకోవచ్చు.