వార్నర్, భార్య నుపుర్‌తో భువనేశ్వర్
సాక్షి, హైదరాబాద్: మ్యాచ్ మ్యాచ్‌కు ప్లే ఆఫ్స్ సమీకరణాలు మారనున్న తరుణంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ జట్లు కొత్త సవాల్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లు లేకుండానే మ్యాచ్‌లో తలపడనున్నాయి. సన్‌రైజర్స్‌కు ఓపెనర్‌గా విశేష సేవలందించిన జానీ బెయిర్‌స్టో... రాజస్తాన్ ప్లే ఆఫ్ రేసులో ఇంకా నిలిచి ఉండేందుకు కారణమైన బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ఇంగ్లండ్‌కు పయనమైన నేపథ్యం లో ఈ రెండు జట్లు మరో గెలుపు కోసం నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత ముఖాము ఖిలో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ పైచేయి సాధించగా... సొంతగడ్డపై గత పరాజయానికి బదులు తీర్చుకోవాలని రాయల్స్ పట్టుదలగా ఉంది.
నూతన ఉత్సాహంతో...
సన్‌రైజర్స్‌తో పోల్చుకుంటే పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉన్నప్పటికీ గురువారం కోల్‌కతాపై సాధించిన విజయం రాజస్తాన్ రాయల్స్‌లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 17 ఏళ్ల రియాన్ పరాగ్ ఆ జట్టుకు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. అజింక్యా రహానే, స్టీవ్ స్మిత్ కూడా ఫామ్‌లోకి రావడం శుభ పరిణామం. ఢిల్లీతో మ్యాచ్‌లో రహానే తన శైలికి భిన్నంగా విరుచుకుపడిన తీరు ఆకట్టుకుంది. సంజూ సామ్సన్, స్టువర్ట్ బిన్నీ బ్యాట్ ఝళిపిస్తే విదేశీ ఆటగాళ్లు లేని లోటు తీర్చినట్లవుతుంది. టర్నర్, లివింగ్‌స్టోన్ ఇప్పటికైనా రాణించాలి. ఆర్చర్ లేని బౌలింగ్ విభాగం కాస్త కలవరపరుస్తోంది. డెత్ ఓవర్లలో ఆర్చర్ మినహా రాయల్స్ తరఫున వేరెవరూ రాణించలేకపోయా రు. అయితే గత మ్యాచ్‌లో వరుణ్ ఆరోన్ ప్రదర్శనతో పాటు ఒషానే థామస్ బౌలింగ్ జట్టులో ఆశలు రేకెత్తిస్తోంది. ధావళ్ కులకర్ణితో పాటు, జైదేవ్ ఉనాద్కట్ తమ స్థాయికి తగినట్లు రాణించాల్సి ఉంది.
సన్‌రైజర్స్ ఆటగాళ్ల ఆట విడుపు...
విలియమ్సన్ రాణిస్తేనే...
10 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.... లీగ్‌లో మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం 3 గెలిస్తే నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకునే పరిస్థితి. ఈ దశలో బెయిర్‌స్టో దూర మవడం సన్‌రైజర్స్ అభిమానులకు మింగుడు పడని అంశమే. అయితే కెప్టెన్ కేన్ విలియమ్సన్ రాణిస్తే హైదరాబాద్‌కు ప్లేఆఫ్ బెర్త్ ఖాయమనడంలో ఎలాంటి సందేహం లేదు. గతేడాది వార్నర్ గైర్హాజరీలో జట్టును ఫైనల్స్‌కు చేర్చిన ఘనత విలియమ్సన్‌ది. ఇప్పడు వీరిద్దరూ ఓపెనింగ్‌లో కుదురుకుంటే జట్టుకు ఎదురుండదు. ఇన్నాళ్లు రైజర్స్‌కు భారమైన మిడిలార్డర్‌లో కాస్త మార్పు మొదలైంది. మనీశ్ పాండే గత మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్ జట్టుకు ఎంపికైన విజయ్ శంకర్ మరింతగా రాణించాల్సిన అవసరం ఉంది. యూసుఫ్ పఠాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. బెయిర్‌స్టో గైర్హాజరీలో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తుదిజట్టులో ఉండే అవకాశముంది. కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ బెయిర్‌స్టో స్థానాన్ని సాహా పూరించగలగాలి. మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్ స్పిన్ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. భువనేశ్వర్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్ధార్థ్ కౌల్‌లతో పేస్ విభాగం కూడా పటిష్టంగా కనబడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment