
బట్లర్‌ను అవుట్ చేసిన ఆనందంలో సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్
సొంత నెపుణ్యాలపై ఆధారపడటమే తనకు క్లిష్టపరిస్థితుల్లో బాగా ఆడటానికి పనికొచ్చిందని సన్‌రైజర్స్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అన్నాడు. శుక్రవారం ఐపీఎల్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ ఆఖరిలో రషీద్ ఖాన్ తన బ్యాటింగ్ ప్రతిభతో జట్టును గట్టెక్కించాడు. చివరి ఓవర్లలో కీలక బ్యాట్స్‌మెన్ల వికెట్లు కోల్పోయి రైజర్స్‌కు ఛేదన కష్టమైన తరుణంలో, రషీద్ ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. రషీద్ తన బౌలింగ్ కోటాలో నాలుగు ఓవర్లు వేసి 24 పరుగులిచ్చి, ప్రధాన బ్యాట్స్‌మన్ బట్లర్‌ను ఔట్ చేశాడు. మ్యాచ్ కీలక దశలో బ్యాటింగ్‌లోనూ రాణించిన ఈ అఫ్గానీ 8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 పరుగులు చేశాడు. ‘కోచింగ్ సిబ్బంది ఇచ్చిన ఆత్మవిశ్వాసం బ్యాటింగ్ సమయంలో బాగా ఆడటానికి పనికొచ్చింది. టామ్ మూడీ, మురళీధరన్, వీవీఎస్ లక్ష్మణ్‌ల పర్యవేక్షణలో, బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌కూ పదునుపెట్టే అవకాశం లభించింది. ప్రతి మ్యాచ్‌నూ సానుకూల దృక్పథంతో ఆడటానికి ప్రయత్నిస్తాన’ని చెప్పుకొచ్చాడీ స్పిన్నర్.
రాయల్స్‌తో మ్యాచ్‌లో రషీద్ కీలక బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ వికెట్ తీసి గట్టి దెబ్బతీశాడు. గతంలో బట్లర్‌ను పలుమార్లు ఔట్ చేయడంతో, ఈసారి అతడ్ని పెవిలియన్ పంపడం సులువైందని రషీద్ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ పిచ్‌పై బంతి పెద్దగా టర్న్ అవ్వకపోవడంతో, ఎక్కువగా గుడ్ లెంగ్త్‌లో వేస్తూ, వైవిధ్యతపైనే దృష్టి పెట్టాను. ఇది ఫలించి బట్లర్ త్వరగా ఔటయ్యాడని రషీద్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇంతలా విజయవంతమవడానికి చిట్కాలేంటని రషీద్‌ను అడగ్గా.. లెగ్‌స్పిన్‌లో 5 రకాల వైవిధ్యాలతో తాను బంతులు వేయగలనని, గుడ్ లెంగ్త్‌లో బంతులు వేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడమే తన విజయ రహస్యమని వివరించాడు.
Comments
Please login to add a commentAdd a comment