మన వంతు ఎప్పుడు? | Ram Kumar US Open Qualifying tournament | Sakshi
Sakshi News home page

మన వంతు ఎప్పుడు?

Published Tue, Jul 18 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM

మన వంతు ఎప్పుడు?

మన వంతు ఎప్పుడు?

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల సింగిల్స్‌ విభాగాల్లో
 పురోగతి లేని భారత ప్రదర్శన
 ♦ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడమే గొప్ప ఘనత
 ♦ డబుల్స్‌ ఫలితాలతోనే సంతృప్తి


ఫెడరర్‌ ‘గ్రాండ్‌’ విజయాలకు ఉప్పొంగిపోతాం. సెరెనా ఘనతలకు సలామ్‌ కొడతాం. 20 లక్షల జనాభా కూడాలేని లాత్వియా లాంటి చిన్నదేశం నుంచి చాంపియన్‌గా అవతరిస్తే అబ్బురపడతాం. ఎప్పుడూ విదేశీ క్రీడాకారుల విజయాలకు సంబర పడే మనం సొంత ఆటగాళ్ల ‘గ్రాండ్‌’ విజయాల కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్నాం. తరాలు మారినా, ఆటలో మార్పులు వచ్చినా... సింగిల్స్‌ విభాగంలో మాత్రం భారత టెన్నిస్‌ క్రీడాకారుల ప్రదర్శనలో పురోగతి కనిపించడంలేదు.

సాక్షి క్రీడావిభాగం
రెండు దశాబ్దాలుగా డబుల్స్‌ విభాగాల్లో భారత క్రీడాకారులు గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో టైటిల్స్‌ సాధిస్తూ వస్తున్నారు. 1997లో మహేశ్‌ భూపతి జపాన్‌ క్రీడాకారిణి రికా హిరాకితో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టైటిల్‌ సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత లియాండర్‌ పేస్, సానియా మీర్జా, రోహన్‌ బోపన్న కూడా డబుల్స్‌ విభాగాల్లో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను గెలిచారు. అయితే సింగిల్స్‌ విభాగానికొచ్చేసరికి భారత క్రీడాకారులు మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడమే గొప్ప ఘనతగా మారిపోయింది.

ఒకవేళ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించినా రెండో రౌండ్‌ను కూడా దాటలేకపోతున్నారు. గత రెండు దశాబ్దాల్లో  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ అత్యుత్తమ ప్రదర్శన లియాండర్‌ పేస్‌దే కావడం గమనార్హం. 1997లో అతను యూఎస్‌ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ ఐదు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆడినా రెండో రౌండ్‌ను దాటి ముందుకెళ్లలేదు. యూకీ బాంబ్రీ 2015, 2016 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో, సాకేత్‌ మైనేని 2016 యూఎస్‌ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ఇటీవలే రామ్‌కుమార్‌ రామనాథన్‌ అంటాల్యా ఓపెన్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించి పెను సంచలనం సృష్టించాడు. అంతా అనుకున్నట్లు జరిగితే రామ్‌కుమార్‌ వచ్చే నెలలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లో క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడే అవకాశముంది.

జూనియర్స్‌లో మెరిసినా...
కొన్నేళ్లుగా జూనియర్‌ స్థాయిలో భారత ఆటగాళ్ల ప్రదర్శన మెరుగ్గానే ఉంటుంది. లియాండర్‌ పేస్‌ 1990లో వింబుల్డన్, 1991లో యూఎస్‌ ఓపెన్, యూకీ బాంబ్రీ 2009 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జూనియర్‌ బాలుర సింగిల్స్‌లో విజేతలుగా నిలిచారు. కానీ సీనియర్‌ స్థాయికొచ్చేసరికి మాత్రం అవే ఫలితాలు రావడంలేదు.  భారత్‌లో నైపుణ్యమైన క్రీడాకారులకు కొదువ లేదు. అయితే వారిని సరైన దిశలో నడిపించే పక్కా వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. పేస్, మహేశ్‌ భూపతి, రోహన్‌ బోపన్న, సానియా మీర్జా సాధించిన విజయాలన్నీ వారి వ్యక్తిగత కృషి, ప్రతిభ ఆధారంగానే లభించాయనడంలో సందేహం లేదు.

 ఇక నుంచైనా నైపుణ్యమున్న జూనియర్‌ క్రీడాకారులను గుర్తించి వారికి విదేశాల్లో సుశిక్షితులైన కోచ్‌ల వద్ద దీర్ఘకాలిక శిక్షణ అందించాలి. ఇప్పుడు టెన్నిస్‌ ఎంతో ఖరీదైన క్రీడగా మారిపోయింది. జూనియర్‌ స్థాయిలోనే ఏడాది పొడువునా శిక్షణ తీసుకుంటూ, ఎంట్రీ ఫీజులు చెల్లిస్తూ, రానుపోను ఖర్చులు భరిస్తూ, వసతి సౌకర్యాల ఏర్పాటుకే కనీసం రూ. 25 లక్షల వరకు ఖర్చవుతుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో మినహా ప్రొఫెషనల్‌ స్థాయిలో క్రీడాకారులకు ప్రభుత్వపరంగా లభించే ఆర్థిక సహాయం అంతంత మాత్రమే.

 ఈ నేపథ్యంలో అంతర్జాతీయస్థాయిలో నిలకడగా ఆడాలంటే భారత క్రీడాకారులకు అంత సులువేం కాదు. ప్రభుత్వంతోపాటు పేరున్న కార్పొరేట్‌ సంస్థలు టెన్నిస్‌ క్రీడను దత్తత తీసుకొని పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకుసాగితే... వచ్చే పదేళ్లలో సింగిల్స్‌ విభాగంలో భారత ఆటగాళ్ల ప్రదర్శన పురోగతి సాధించే అవకాశాలున్నాయి.

రామ్‌కుమార్‌కు కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌
గతవారం వినెట్కా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన రామ్‌కుమార్‌ రామనాథన్‌ తన కెరీర్‌లో బెస్ట్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సోమవారం విడుదల చేసిన పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో రామ్‌కుమార్‌ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 168వ ర్యాంక్‌ను సాధించాడు. దాంతో చెన్నైకు చెందిన 22 ఏళ్ల రామ్‌కుమార్‌ ప్రస్తుతం భారత నంబర్‌వన్‌ ప్లేయర్‌గా నిలిచాడు. రామ్‌కుమార్‌ తర్వాత భారత్‌ నుంచి యూకీ బాంబ్రీ (212), ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ (214), శ్రీరామ్‌ బాలాజీ (293), సుమీత్‌ నాగల్‌ (306) వరుస స్థానాల్లో ఉన్నారు. డబుల్స్‌లో రోహన్‌ బోపన్న 22వ ర్యాంక్‌లో ఉండగా... దివిజ్‌ శరణ్, పురవ్‌ రాజా వరుసగా 51వ, 52వ ర్యాంక్‌ల్లో నిలిచారు. లియాండర్‌ పేస్‌ 59వ ర్యాంక్‌లో, జీవన్‌ నెదున్‌చెజియాన్‌ 98వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో సానియా మీర్జా తన ఏడో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... సింగిల్స్‌లో అంకితా రైనా 277వ ర్యాంక్‌లో, కర్మాన్‌కౌర్‌ థండి 400వ ర్యాంక్‌లో ఉన్నారు.  

అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సర్క్యూట్‌లో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారుడు టైటిల్‌ సాధించి 19 ఏళ్లు గడిచిపోయాయి. చివరిసారి 1998లో లియాండర్‌ పేస్‌ న్యూపోర్ట్‌ ఓపెన్‌లో సింగిల్స్‌ విజేతగా నిలిచాడు.

ఇక మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సర్క్యూట్‌లో భారత్‌ తరఫున ఏకైక సింగిల్స్‌ టైటిల్‌ను సానియా మీర్జా సాధించింది. 2005లో హైదరాబాద్‌ ఓపెన్‌లో సానియా చాంపియన్‌గా నిలిచింది. సానియా మీర్జా తర్వాత ఇప్పటివరకు మరే భారత క్రీడాకారిణి డబ్ల్యూటీఏ టోర్నీల్లో సింగిల్స్‌ విభాగంలో పాల్గొనే అర్హత సాధించలేదు.

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత అత్యుత్తమ ప్రదర్శన రామనాథన్‌ కృష్ణన్‌ ద్వారా వచ్చింది. ఆయన 1960, 1961 వింబుల్డన్‌ టోర్నీల్లో సెమీఫైనల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రామనాథన్‌ తనయుడు రమేశ్‌ కృష్ణన్‌ 1986 వింబుల్డన్‌ టోర్నీలో... 1981, 1987 యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ ఆడారు. అనంతరం విజయ్‌ అమృత్‌రాజ్‌ వింబుల్డన్‌ (1973, 1981లో), యూఎస్‌ ఓపెన్‌ (1973, 1974) టోర్నీలలో రెండుసార్లు చొప్పున క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.

సింగిల్స్‌ విభాగంలో 1973లో ఏటీపీ అధికారికంగా ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టగా... పురుషుల సింగిల్స్‌లో భారత్‌ తరఫున విజయ్‌ అమృత్‌రాజ్‌ (1980లో) అత్యున్నతంగా 16వ ర్యాంక్‌లో నిలిచారు. ఆ తర్వాత రమేశ్‌ కృష్ణన్‌ 23వ ర్యాంక్‌లో (1985లో), సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్‌ 62వ ర్యాంక్‌లో (2011లో) నిలిచారు.  మహిళల సింగిల్స్‌లో సానియా మీర్జా 2007లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌ను సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement