ఐపీఎల్ నుంచి మరో స్టార్ ప్లేయర్ ఔట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీలో ఒకటైన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్(ఆర్‌పీఎస్) ఓ కీలక ఆటగాడి సేవలను కోల్పోనుంది. భారత స్టార్ స్పిన్నర్, పుణే ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అశ్విన్ తాజా ఐపీఎల్-10కు దూరం కానున్నడాని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. గతేడాది ఏర్పడిన పుణే జట్టు తమ తొలి సీజన్ లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో తీవ్ర నిరాశపరిచిన విషయం తెలిసిందే. అశ్విన్ సేవలు కోల్పోతే ఈ సీజన్‌లో జట్టు విజయాలపై ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అశ్విన్ కానీ, పుణే జట్టుగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను కోహ్లీ నేతృత్వంలో 2-1తో నెగ్గిన జట్టులో కీలక సభ్యుడు అశ్విన్. ఈ క్రమంలో సిరీస్ ముగిసిన అనంతరం ముంబైలో అశ్విన్‌కు పరీక్షలు నిర్వహించారు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు అశ్విన్ విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో సూచించినట్లు తెలుస్తోంది. ఈ సమ్మర్‌లో ఐసీసీ నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం వరకు పూర్తిస్థాయిలో కోలుకుని భారత జట్టుతో చేరనున్నాడని సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్లో గాయపడ్డ రాహుల్ ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు.