‘గురి’ అదిరింది
షూటింగ్‌లో రష్మీ... ఆర్చరీలో బైరాగిలకు స్వర్ణాలు
తిరువనంతపురం: జాతీయ క్రీడల్లో తెలుగు తేజాల గురి అదిరింది. షూటింగ్‌లో తెలంగాణ అమ్మాయి రష్మీ రాథోడ్... ఆర్చరీలో ఆంధ్రప్రదేశ్ యువతార జెమ్మిలి బైరాగి నాయుడు పసిడి పతకాలను సాధించారు. శనివారం జరిగిన మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్‌లో రష్మీ రాథోడ్ 63 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
ఆరుగురు పాల్గొన్న ఫైనల్స్‌లో సానియా షేక్ (చత్తీస్‌గఢ్) 62 పాయింట్లతో రజతం సాధించగా... మహేశ్వరి చౌహాన్ (రాజస్థాన్-59 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల ఆర్చరీలో ఇండియన్ రౌండ్ వ్యక్తిగత విభాగంలో బైరాగి నాయుడు విజేతగా నిలిచాడు. ఫైనల్లో బైరాగి నాయుడు 6-2 పాయింట్ల తేడాతో బీరేంద్రనాథ్ సింగ్ (మణిపూర్)ను ఓడించాడు.
విష్ణుకు కాంస్యం: పురుషుల టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో విష్ణు తమిళనాడు ప్లేయర్ రామ్‌కుమార్ రామనాథన్ చేతిలో వరుస సెట్‌లలో ఓడిపోయాడు. మరోవైపు పురుషుల, మహిళల డబుల్స్ విభాగాల్లో తెలంగాణకు రెండు పతకాలు ఖాయమయ్యాయి. పురుషుల డబుల్స్‌లో విష్ణువర్ధన్-సాకేత్ మైనేని ద్వయం; మహిళల డబుల్స్‌లో సౌజన్య భవిశెట్టి-నిధి చిలుముల జంట ఫైనల్లోకి దూసుకెళ్లాయి. మరోవైపు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ) తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పతకాల పట్టికలో 67 పతకాలతో (42 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్యాలు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఖాతాలో 12 పతకాలు (4 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలు); తెలంగాణ ఖాతాలో 11 పతకాలు (3 స్వర్ణాలు, 6 రజతాలు, 2 కాంస్యాలు) ఉన్నాయి.