
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
పెర్త్: మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్నరెండో టెస్టులో మరో డబుల్ సెంచరీ నమోదైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ డబుల్ సెంచరీతో అదరగొడితే... న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో రాస్ టేలర్ ద్విశతకంతో దుమ్మురేపాడు. రాస్ టేలర్(235 బ్యాటింగ్; 308 బంతుల్లో 34 ఫోర్లు) ఆసీస్ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. రాస్ టేలర్ కు జతగా విలియమ్సన్(166; 250 బంతుల్లో 24 ఫోర్లు) మరోసారి ఆకట్టుకోవడంతో కివీస్ భారీ స్కోరు దిశగా పయనిస్తూ ఆసీస్ కు దీటుగా సమాధానమిస్తోంది.
140/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు ఆటను కొనసాగించిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఒక పక్క టేలర్ తనదైన ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడుతుంటే, విలియమ్సన్ కచ్చితమైన షాట్లతో అలరించాడు. ఈ క్రమంలోనే విలియమ్సన్ 150 పరుగుల మార్కును చేరగా, టేలర్ డబుల్ సెంచరీ నమెదు చేశాడు. కాగా, హజిల్ వుడ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన విలియమ్సన్ మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అనంతరం బ్రెండన్ మెకల్లమ్(27), బ్రాస్ వెల్(12), వాట్లింగ్(1) అవుటయ్యారు. దీంతో న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 510 పరుగులతో ఉంది. టేలర్(235) , మార్క్ క్రెయిగ్ (7) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు ఆసీస్ 559/9 వద్ద తన తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టును గెలిచిన ఆసీస్ 1-0 ముందంజలో ఉంది.
విశేషాలు..
ఆసీస్ లో డబుల్ సెంచరీ చేసిన ఆరో విదేశీ బ్యాట్స్ మెన్ గా టేలర్ రికార్డు సాధించాడు
ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ తరపున (235) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టేలర్ గుర్తింపు
ఆస్ట్రేలియాపై టేలర్-విలియమ్సన్(265) అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం న్యూజిలాండ్ కు ఇదే తొలిసారి(ఏ వికెట్ కైనా)
టెస్టుల్లో రాస్ టేలర్-విలియమ్సన్ లు జోడి (42 ఇన్నింగ్స్ లలో 2,188 పరుగులు ) అత్యధిక పరుగులను సాధించింది.