
రాస్ టేలర్ అరుదైన ఘనత!
పెర్త్: మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సోమవారం నాల్గో రోజు ఆటలో భాగంగా తృటిలో ట్రిపుల్ సెంచరీని కోల్పోయిన టేలర్ (290;374 బంతుల్లో 43 ఫోర్లు) న్యూజిలాండ్ తరపున అత్యధిక స్కోరు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఆదివారం ఆటలో ఆసీస్ పై ఆస్ట్రేలియాలో డబుల్ సెంచరీ చేసిన ఆరో విదేశీ బ్యాట్స్ మెన్ గా రికార్డు సాధించిన టేలర్.. ఓవరాల్ గా ఆసీస్ పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టేలర్ సుదీర్ఘంగా 567 నిమిషాల పాటు క్రీజ్ లో ఉండి ఈ ఘనతను అందుకున్నాడు.
అంతకుముందు ఇంగ్లండ్ కు చెందిన హట్టన్(364 పరుగులు) సాధించి ముందు వరుసలో ఉండగా, మరో ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫోస్టర్(287 పరుగులు) తృతీయ స్థానంలో, భారత్ కు చెందిన వీవీఎస్ లక్ష్మణ్(281 పరుగులు) నాల్గో స్థానంలో, విండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా(277 పరుగులు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
ఆసీస్-న్యూజిలాండ్ ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ లో 559/9 వద్ద డిక్లేర్ చేయగా.. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్ లో 624 పరుగులు చేసింది. రాస్ టేలర్ డబుల్ సెంచరీతో పాటు, విలియమ్సన్(166;250 బంతుల్లో 24 ఫోర్లు) మరో శతకం చేయడంతో కివీస్ భారీ స్కోరు చేసింది. 510/6 ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట కొనసాగించిన కివీస్ మరో 114 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి 63.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(131 బ్యాటింగ్), వోజస్(101 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో ఇప్పటివరకూ ఆరు సెంచరీలు నమోదయ్యాయి. తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచి 1-0 తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే.