ఎన్నాళ్లో వేచిన విజయం
తన 81వ రేసులో విజేతగా నిలిచిన బొటాస్
రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
సోచి (రష్యా): ఒకటా... రెండా... మూడా... ఏకంగా 80 రేసుల్లో పాల్గొన్నాడు. కానీ ఏనాడూ విజేతగా నిలువలేకపోయాడు. అయితే ఏ దశలోనూ నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఎట్టకేలకు 81వ రేసులో విజయాన్ని హస్తగతం చేసుకున్నాడు. అతనే మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో బొటాస్ టైటిల్ దక్కించుకున్నాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును ఈ ఫిన్‌లాండ్ డ్రైవర్ గంటా 28 నిమిషాల 08.743 సెకన్లలో ముగించి తన కెరీర్‌లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
‘పోల్ పొజిషన్’తో సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రేసును ప్రారంభించగా... మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన బొటాస్ తొలి ల్యాప్‌లోనే వెటెల్‌ను ఓవర్‌టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా అవతరించాడు. వెటెల్‌కు రెండో స్థానం, రైకోనెన్ (ఫెరారీ)కు మూడో స్థానం లభించాయి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 14న జరుగుతుంది.