Walteri Botas
-
క్వాలిఫయింగ్‌లో హామిల్టన్‌కు నిరాశ
పోర్టిమావో (పోర్చుగల్): కెరీర్లో 100వ పోల్ పొజిషన్ సాధించేందుకు డిఫెండింగ్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో వారం రోజులు వేచి చూడాలి. తాజా ఫార్ములావన్ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోర్చుగల్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ రెండో స్థానంలో నిలిచాడు. గత రెండు రేసుల్లో నిరాశ పరిచిన మెర్సిడెస్ జట్టుకే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ మాత్రం ఈ క్వాలిఫయింగ్ సెషన్లో అదరగొట్టాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను నిమిషం 18.348 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్‌ను సొంతం చేసుకున్నాడు. అతడి కెరీర్లో ఇది 17వ పోల్. ఆదివారం జరిగే ప్రధాన రేసును బొటాస్ తొలి స్థానం నుంచి ఆరంభించనున్నాడు. రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచాడు. సీజన్లో ఇప్పటి వరకు మూడు క్వాలిఫయింగ్ సెషన్లు జరగ్గా... ఈ మూడు సార్లు వేర్వేరు డ్రైవర్లు పోల్ పొజిషన్‌ను దక్కించుకున్నారు. బహ్రెయిన్‌లో వెర్స్టాపెన్, ఇమోలా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌లు పోల్ పొజిషన్‌తో మెరిశారు. గ్రిడ్ పొజిషన్స్ 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. పెరెజ్ (రెడ్‌బుల్), 5. సెయింజ్ (ఫెరారీ), 6. ఒకాన్ (ఆల్పైన్), 7. నోరిస్ (మెక్లారెన్), 8. లెక్లెర్క్ (ఫెరారీ), 9, గ్యాస్లీ (ఆల్ఫా టారీ), 10. వెటెల్ (ఆస్టన్ మార్టిన్), 11. రసెల్ (విలియమ్స్), 12. జియోవినాజి (ఆల్ఫా రోమియో), 13. అలోన్సో (ఆల్పైన్), 14, సునోడా (ఆల్ఫా టారీ), 15. రైకొనెన్ (ఆల్ఫా రోమియో), 16. రికియార్డో (మెక్లారెన్) 17. స్ట్రోల్ (ఆస్టన్ మార్టిన్), 18. లతీఫ్ (విలియమ్స్), 19. మిక్ షుమాకర్ (హాస్), 20. మేజ్‌పిన్ (హాస్) -
విజేత హామిల్టన్
ఇమోలా: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తాజా ఎఫ్1 సీజన్లో మరో రేసు విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 63 ల్యాప్‌ల ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. రేసును ఆరంభించడంలో విఫలమైన హామిల్టన్ తొలి ల్యాప్‌లో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అయితే 21వ ల్యాప్‌లో సహచర మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ టైర్లు మార్చుకోవడానికి పిట్స్లోకి రావడంతో లీడ్‌లోకి వచ్చిన హామిల్టన్... తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో హామిల్టన్‌కు ‘వర్చువల్ సేఫ్టీ కారు’ రూపంలో అదృష్టం కూడా తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. 33వ ల్యాపులో ఒకాన్ (రెనౌ) కారులో సమస్య తలెత్తడంతో... అతడు తన కారును ట్రాక్ పక్కన నిలిపేశాడు. దాంతో ఆ కారును తొలగించే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా... ఎఫ్1 స్టీవర్డ్స్ ‘వర్చువల్ సేఫ్టీ కారు’ను డెప్లాయ్ చేశారు. అదే సమయంలో తన కారు టైర్లను మార్చుకున్న హామిల్టన్ తొలి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న అతడు విజేతగా నిలిచాడు. బొటాస్ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 51వ ల్యాప్‌లో టైరు పంక్చర్ కావడంతో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రేసు నుంచి వైదొలిగాడు. సీజన్లో 13 రేసులు ముగిశాక హామిల్టన్ 282 పాయింట్లతో డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వరుసగా ఏడో ఏడాది (2014, 15, 16, 17, 18, 19, 20) కన్స్ట్రక్టర్ (జట్టు) చాంపియన్‌షిప్ టైటిల్‌ను నెగ్గి ఈ రికార్డును సాధించిన తొలి ఎఫ్1 టీమ్‌గా నిలిచింది. -
‘చైనా’ చాంప్ హామిల్టన్
షాంఘై: క్వాలిఫయింగ్‌లో వెనుకబడినా... ప్రధాన రేసులో అదరగొట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్లో రెండో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ చాంపియన్‌గా నిలిచాడు. 56 ల్యాప్‌ల ఈ రేసును హామిల్టన్ గంటా 32 నిమిషాల 06.350 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని అలంకరించాడు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రధాన రేసు మొదలైన వెంటనే తొలి మలుపులోనే బొటాస్‌ను ఓవర్టేక్ చేసిన హామిల్టన్. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కొనసాగించి ఫార్ములావన్‌లో 1000వ రేసుగా జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో ఆరోసారి చాంపియన్ అయ్యాడు.ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ముగ్గురు డ్రైవర్లు లాండో నోరిస్ (మెక్లారెన్), డానిల్ క్వియాట్ (ఎస్టీఆర్), హుల్కెన్‌బర్గ్ (రెనౌ) రేసు ముగించకుండానే మధ్యలో వైదొలిగారు. ఈ సీజన్లో మూడు రేసుల తర్వాత హామిల్టన్ (68 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా... బొటాస్ (62 పాయింట్లు) రెండో స్థానంలో, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్–39 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 28న జరుగుతుంది. -
భళా.. బొటాస్
మెల్బోర్న్: ఫార్ములావన్ 2019 సీజన్ తొలి రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో బొటాస్ 58 ల్యాప్‌లను గంటా 25 నిమిషాల 27.325 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ చాంపియన్ , మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అతను గంటా 25 నిమిషాల 48.211 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. గతేడాది పలు రేసుల్లో బొటాస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లినా హామిల్టన్ వరల్డ్ టైటిల్ అవకాశాలకు దెబ్బ పడకూడదనే ఉద్దేశంతో రేసు జరుగుతున్న సమయంలోనే మెర్సిడెస్ యాజమాన్యం వేగం తగ్గించాలని, హామిల్టన్‌కు సహకరించాలని బొటాస్‌కు సూచనలు ఇచ్చింది. ఈ అంశంపై బొటాస్ బహిరంగంగానే తన అసంతృప్తిని కూడా వ్యక్తం చేశాడు. అయితే ఈ సీజన్ లోని తొలి రేసులో మాత్రం అలా జరగలేదు. పోల్ పొజిషన్‌తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌ను తొలి ల్యాప్ మలుపులోనే రెండో స్థానంలో ఉన్న బొటాస్ ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత బొటాస్ వెనుదిరిగి చూడలేదు. 2017లో అబుదాబిలో టైటిల్ గెలిచిన తర్వాత బొటాస్‌కు మళ్లీ టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. గత సంవత్సరం బొటాస్‌కు ఏదీ కలిసి రాలేదు. క్వాలిఫయింగ్‌లో రాణించినా, ప్రధాన రేసులో విఫలమవ్వడం... కారులో సాంకేతిక సమస్యలు తలెత్తడం... ఇతరత్రా కారణాలతో అతను ఒక్క రేసులో కూడా గెలవలేకపోయాడు. కానీ ఈ సీజన్లో తొలి రేసులోనే అతను విజేతగా నిలిచి మరిన్ని టైటిల్స్‌పై దృష్టి పెట్టాడు. ఓవరాల్‌గా 119 రేసుల్లో పాల్గొన్న బొటాస్ కిది నాలుగో టైటిల్. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 31న జరుగుతుంది. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఫలితాలు (టాప్–10): 1. బొటాస్ (మెర్సిడెస్), 2. హామిల్టన్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. వెటెల్ (ఫెరారీ), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. మాగ్నుసెన్ (హాస్), 7. హుల్కెన్ బర్గ్ (రెనౌ), 8. రైకోనెన్ (అల్ఫా రోమియో రేసింగ్), 9. స్ట్రాల్ (రేసింగ్ పాయింట్), 10. క్వియాట్ (ఎస్టీఆర్). -
ఎన్నాళ్లో వేచిన విజయం
తన 81వ రేసులో విజేతగా నిలిచిన బొటాస్ రష్యా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సోచి (రష్యా): ఒకటా... రెండా... మూడా... ఏకంగా 80 రేసుల్లో పాల్గొన్నాడు. కానీ ఏనాడూ విజేతగా నిలువలేకపోయాడు. అయితే ఏ దశలోనూ నిరుత్సాహపడకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. ఎట్టకేలకు 81వ రేసులో విజయాన్ని హస్తగతం చేసుకున్నాడు. అతనే మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో బొటాస్ టైటిల్ దక్కించుకున్నాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును ఈ ఫిన్లాండ్ డ్రైవర్ గంటా 28 నిమిషాల 08.743 సెకన్లలో ముగించి తన కెరీర్లో తొలి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) రేసును ప్రారంభించగా... మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన బొటాస్ తొలి ల్యాప్‌లోనే వెటెల్‌ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి ల్యాప్ వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా అవతరించాడు. వెటెల్‌కు రెండో స్థానం, రైకోనెన్ (ఫెరారీ)కు మూడో స్థానం లభించాయి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్ గ్రాండ్‌ప్రి ఈనెల 14న జరుగుతుంది.