సన్నిహితులకు విందు ఇచ్చిన సచిన్
ముంబై: బాలీవుడ్ స్టార్లు...వ్యాపారవేత్తలు... రాజకీయనాయకులు... భారత క్రికెటర్లు... ఇలా అనేక మంది ప్రముఖులతో సచిన్ టెండూల్కర్ పార్టీ కళకళలాడింది. తన సన్నిహితుల కోసం సచిన్ సోమవారం రాత్రి ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశాడు. ఇక్కడి అంధేరీ ఈస్ట్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఈ విందు కార్యక్రమం జరిగింది. నలుపు రంగు సూట్‌లో సచిన్, అదే రంగు డ్రెస్ ధరించిన అంజలి స్వయంగా అతిథులను ఆహ్వానించారు. బాలీవుడ్‌నుంచి అమితాబ్, ఆమిర్ ఖాన్, రాహుల్ బోస్, కరణ్ జొహర్ దీనికి హాజరయ్యారు. క్రికెటర్లు గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్ కూడా వచ్చారు. ప్రస్తుతం ఆడుతున్న ధోని, కోహ్లితో పాటు యువ క్రికెటర్లు పార్టీలో సందడి చేశారు. మాజీ ఆటగాళ్లు అజహర్, గవాస్కర్, శ్రీకాంత్, సందీప్ పాటిల్‌లు కూడా వచ్చారు.
రాజకీయ ప్రముఖులు శరద్ పవార్, రాజ్ థాకరే, మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్‌లతో పాటు నీతా అంబాని, సుబ్రతా రాయ్‌లను సచిన్ ఈ విందు కోసం ప్రత్యేకంగా ఆహ్వానించారు. పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం కావడంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మీడియాను దూరంగా ఉంచిన ఈ కార్యక్రమంలో ఫొటోలు తీయవద్దంటూ మాస్టర్ స్వయంగా విజ్ఞప్తి చేశాడు. స్నేహితులు, కెరీర్‌లో సాయం చేసిన కోచ్‌లు, ప్రముఖులు అందరూ కలిపి సుమారు వెయ్యిమంది ఇందులో పాల్గొన్నారు. రాత్రి 12 గంటల వరకు ఈ పార్టీ సాగింది.
పార్టీలో కొన్ని హైలైట్స్...
ఆమిర్‌ఖాన్ సచిన్‌ను వేదికపైకి పిలిచాడు...తన బెస్ట్ సాంగ్ ‘పాపా కహతే హై...’ పాడి సచిన్‌కు అంకితమిచ్చాడు.
ఆశాభోంస్లే వేదికపైకి వచ్చినా...పాట పాడనని సున్నితంగా తిరస్కరించి
అమితాబ్‌ను మాట్లాడవలసిందిగా కోరారు.
యువరాజ్‌సింగ్ తన మిత్రుడు రాసిన కవితను చదివి వినిపించడం విశేషం.
పాల్గొన్నవారిలో గవాస్కర్, ధోని మాత్రమే హిందీలో మాట్లాడారు .
చివర్లో అంజలి, సచిన్ కూడా భావోద్వేగంతో మాట్లాడారు.