మరో టైటిల్కు అడుగుదూరంలో..
బ్యాంకాక్: ఇటీవల సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గి మంచి ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ భమిడిపాటి సాయిప్రణీత్ మరో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సాయి ప్రణీత్ అంచనాలను అందుకుంటూ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సాయి ప్రణీత్ 21-11,21-15 తేడాతో పనావిత్(థాయ్లాండ్)ను మట్టికరిపించి తుది పోరుకు అర్హత సాధించాడు.
ఏకపక్షంగా సాగిన పోరులో సాయి ప్రణీత్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. కేవలం 36 నిమిషాల్లోనే పోరును ముగించి ఆదివారం అమీతుమీ పోరుకు సిద్ధమయ్యాడు. తుది పోరులో ఇండోనేషియా ఆటగాడు జొనాతన్ క్రిస్టీతో సాయి ప్రణీత్ తలపడనున్నాడు. ఇది సాయి ప్రణీత్ కు మూడో గ్రాండ్ ప్రి ఫైనల్. ఈ ఏడాది సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిలో రన్నరప్ గా నిలిచిన సాయి ప్రణీత్.. 2016 కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రిలో మాత్రం టైటిల్ సాధించాడు.