ఫైనల్లో సాయిప్రణీత్
సెమీస్‌లో సైనా ఓటమి
బ్యాంకాక్: గత నెలలో సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన భారత బ్యాడ్మింటన్ యువతార భమిడిపాటి సాయిప్రణీత్... మరో అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ సాయిప్రణీత్ 21–11, 21–15తో పనావిత్ తోంగ్‌నువామ్ (థాయ్‌లాండ్)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో సాయిప్రణీత్ తలపడతాడు.
రెండో సెమీఫైనల్లో జొనాథన్ క్రిస్టీ 21–9, 21–18తో జూ వెన్ సూంగ్ (మలేసియా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో సాయిప్రణీత్ గెలిస్తే 43 ఏళ్ల ఈ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన రెండో భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందుతాడు. 2013లో కిడాంబి శ్రీకాంత్ ఈ టైటిల్‌ను సాధించాడు. మహిళల సింగిల్స్ విభాగంలో సైనా 2011లో విజేతగా నిలిచింది.
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనా నెహ్వాల్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ 13వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్బామ్రుంగ్పన్ (థాయ్‌లాండ్)తో జరిగిన సెమీఫైనల్లో సైనా 19–21, 18–21తో ఓడిపోయింది. గతంలో బుసానన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన సైనా నాలుగోసారి మాత్రం ఓటమి రుచి చూసింది.
పురుషుల సింగిల్స్ ఫైనల్ మధ్యాహ్నం గం. 1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం