
ఇంకొక్క అడుగే...
చైనా ఓపెన్ ఫైనల్లో సైనా
* సెమీస్‌లో యిహాన్ వాంగ్‌పై విజయం
* నేడు లీ జురుయ్‌తో తుది పోరు
- ఉదయం 11:30కు మ్యాచ్ ప్రారంభం.. స్టార్ స్పోర్ట్స్ 4లో ప్రత్యక్ష ప్రసారం
ఫుజౌ (చైనా): పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటే కఠిన ప్రత్యర్థులను కూడా అలవోకగా ఓడించే సత్తా తనలో ఉందని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మరోసారి నిరూపించింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది.
శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 21-13, 21-18తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ యిహాన్ వాంగ్ (చైనా)పై గెలిచింది. ఈ ఏడాది యిహాన్ వాంగ్‌పై సైనాకిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. గతంలో యిహాన్ వాంగ్‌తో ఆడిన 12 మ్యాచ్‌ల్లో సైనా మూడుసార్లు నెగ్గి, తొమ్మిదిసార్లు ఓడిపోయింది.
ఆదివారం జరిగే టైటిల్ పోరులో లండన్ ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)తో సైనా అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సైనా 2-9తో వెనుకంజలో ఉంది. లీ జురుయ్‌ను సైనా ఓడించి మూడేళ్లు గడిచింది. చివరిసారి 2012 ఇండోనేసియా ఓపెన్‌లో లీ జురుయ్‌ను ఓడించిన సైనా ఆ తర్వాత ఆమెతో ఐదుసార్లు ఆడి ఐదింటిలోనూ ఓటమి పాలైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతోపాటు టాప్ సీడ్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన సైనా స్థాయికి తగ్గట్టు ఆడుతూ అంతిమ సమరానికి అర్హత సాధించింది.
గత ఆగస్టులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన సైనా... ఆ తర్వాత పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో జపాన్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. అయితే చైనా ఓపెన్‌కు పక్కాగా సిద్ధమైన సైనా ఒక్కో అడ్డంకిని దాటుతూ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచింది.
యిహాన్ వాంగ్‌తో 41 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో సైనా అద్వితీయ ప్రదర్శన కనబరిచింది. తొలి గేమ్ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఒకదశలో సైనా 3-5తో వెనుకబడింది. అయితే సైనా వెంటనే తేరుకొని వరుసగా ఆరు పాయింట్లు సాధించి 9-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు 14-13తో ఉన్నదశలో సైనా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ కూడా హోరాహోరీగా సాగింది. పలుమార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. అయితే కీలకదశలో సైనా పైచేయి సాధించి యిహాన్ వాంగ్ ఓటమిని ఖాయం చేసింది.
లిన్ డాన్‌కు లీ చోంగ్ వీ షాక్
పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) గంటా 32 నిమిషాల పోరాటంలో 17-21, 21-19, 21-19తో చైనా దిగ్గజం లిన్ డాన్‌పై గెలిచాడు. లిన్ డాన్ చేతిలో 25 సార్లు ఓడిన లీ చోంగ్ వీకిది అతనిపై పదో విజయం కావడం గమనార్హం. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా)తో లీ చోంగ్ వీ ఆడతాడు.
నేటి ఫైనల్స్ ఉదయం గం. 11.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం