సెమీస్‌లో సైనా సింధుకు నిరాశ
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ సెమీస్‌కు చేరుకోగా... ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఆరో సీడ్ సైనా 21-18, 21-19తో ఎరికో హీరోస్ (జపాన్)పై విజయం సాధిస్తే.... ఎనిమిదోసీడ్ సింధు 17-21, 17-21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పోరాడి ఓడింది. హీరోస్‌తో 47 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సైనా ఆధిపత్యం కనబర్చింది.
4-0తో తొలి గేమ్‌ను ఆరంభించిన హైదరాబాద్ అమ్మాయి తర్వాత 8-2తో ఆధిక్యంలో నిలిచింది. అయితే హీరోస్ పోరాడి స్కోరు 10-10, 18-18తో సమం చేసినా చివర్లో సైనా మూడు వరుస పాయింట్లతో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ ఆరంభంలో హీరోస్ 2-3తో దగ్గరకొచ్చినా తర్వాత ఏ దశలోనూ భారత ప్లేయర్‌ను అందుకోలేకపోయింది. మారిన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు గట్టిపోటీ ఇచ్చింది. తొలి గేమ్‌లో తరచు ఆధిక్యం చేతులు మారడంతో స్కోరు 17-17తో సమమైంది.
కానీ నెట్ వద్ద అప్రమత్తంగా వ్యవహరించిన మారిన్ వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సింధు దూకుడుగా ఆడటంతో ఓ దశలో ఇద్దరు క్రీడాకారిణులు 7-7 వద్ద సమంగా నిలిచారు. అయితే ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచడంలో విఫలమైన సింధు 15-20తో వెనుకబడింది. ఈ దశలో మారిన్ సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా క్రమంగా వెనుకబడిపోయింది. శనివారం జరిగే సెమీస్‌లో సైనా... ప్రపంచ రెండో ర్యాంకర్ షిజియాన్ వాంగ్‌తో తలపడుతుంది. వాంగ్‌తో ముఖాముఖి రికార్డు 4-3 ఉన్నా.. ఇటీవల తలపడిన రెండుసార్లు సైనా ఓడింది.