సైనా... ఈసారైనా!
‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ బరిలో భారత స్టార్
బర్మింగ్‌హమ్: కొత్త ఏడాదిలో సయ్యద్ మోడి ‘గ్రాండ్‌ప్రి గోల్డ్’ టైటిల్స్ నెగ్గి శుభారంభం చేసిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ‘సూపర్ సిరీస్’ సీజన్‌ను కూడా ‘సూపర్'గా ఆరంభించాలనే లక్ష్యంతో ఉన్నారు. గతంలో జనవరిలోనే మలేసియా ఓపెన్‌తో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ల సీజన్ మొదలయ్యేది. అయితే ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌తో సూపర్ సిరీస్ టోర్నమెంట్‌ల సీజన్ ప్రారంభంకానుంది. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లోని అగ్రశ్రేణి క్రీడాకారులందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
తొలి రోజున కేవలం క్వాలిఫయింగ్ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి. బుధవారం నుంచి అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నీగా పేరున్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌ను 5 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 10 లక్షలు)తో నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 37,500 డాలర్ల (రూ. 23 లక్షల 22 వేలు) చొప్పున లభిస్తాయి.
వరుసగా తొమ్మిదో ఏడాది...
తన కెరీర్‌లో మొత్తం ఎనిమిది సూపర్ సిరీస్ టైటిల్స్‌ను నెగ్గిన సైనా ఖాతాలో ‘ఆల్ ఇంగ్లండ్’ ఓపెన్ ఇంకా చేరలేదు. వరుసగా తొమ్మిదో ఏడాది ఈ టోర్నీలో ఆడనున్న సైనా గతంలో రెండుసార్లు (2010, 2013) సెమీఫైనల్‌కు చేరుకుంది. బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో సైనా ఆడనుంది. గాయం కారణంగా సింధు ఈ టోర్నీలో బరిలోకి దిగడం లేదు.
పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్‌తోపాటు ప్రపంచ ఐదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ మెయిన్ ‘డ్రా'లో ఉన్నారు. గతేడాది లిన్ డాన్‌ను ఓడించి చైనా ఓపెన్ సాధించిన శ్రీకాంత్... ఈ ఏడాది సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన కశ్యప్ ఈ మెగా టోర్నీలో ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. తొలి రౌండ్‌లో ఆరో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో కశ్యప్; కెంటో మెమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడతారు.
ఇప్పటివరకు నేను ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ గెలువలేదు. రెండుసార్లు సెమీస్‌కు చేరినా తదుపరి అడ్డంకిని దాటలేకపోయాను. ఈ ఏడాది నా రికార్డును సవరించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాను. ఈ టైటిల్ సాధించాలన్నది నా స్వప్నం. గత నెలంతా చక్కగా గడిచింది. బెంగళూరులో తీవ్రంగా సాధన చేశాను. దేవుడి దయతో ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈసారి మెరుగ్గా రాణిస్తాననే విశ్వాసంతో ఉన్నాను. -సైనా