ఇద్దరూ ఇద్దరే
సైనా, కశ్యప్ సింగిల్స్ చాంప్స్
గతేడాది గొప్ప విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్.. అదే జోరును కొత్త ఏడాదిలోనూ కొనసాగించారు. స్వదేశంలో జరిగిన సయ్యద్ మోడి స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో సైనా మహిళల సింగిల్స్‌లో... కశ్యప్ పురుషుల సింగిల్స్‌లో చాంపియన్స్‌గా నిలిచారు. సైనా రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోగా... కశ్యప్ రెండు గేముల్లోనూ గేమ్ పాయింట్లను కాచుకొని నెగ్గడం విశేషం.
లక్నో: ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన సైనా నెహ్వాల్ కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. తాను బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే ఈ హైదరాబాద్ అమ్మాయి విజేతగా నిలిచింది. ఆదివారం ముగిసిన సయ్యద్ మోడి స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 19-21, 25-23, 21-16తో ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)పై అద్భుత విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సైనా తొలి గేమ్ కోల్పోయి... రెండో గేమ్‌లో 19-20, 20-21 స్కోర్ల వద్ద రెండుసార్లు మ్యాచ్ పాయింట్‌లను కాపాడుకుంది.
కీలకదశలో సంయమనంతో ఆడిన సైనా రెండు గేమ్‌లను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. ఆ తర్వాత మారిన్ తేరుకునే ప్రయత్నం చేసినా సైనా నిలకడగా పాయింట్లు స్కోరు చేసి చివరకు గంటా 19 నిమిషాల్లో విజయాన్ని ఖాయం చేసుకొని ఈ టైటిల్‌ను మూడోసారి తన ఖాతాలోకి వేసుకుంది. 2009, 2014లోనూ సైనాకు ఈ టైటిల్ లభించింది.
ఇద్దరు భారత అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ పారుపల్లి కశ్యప్ 23-21, 23-21తో ప్రపంచ 5వ ర్యాంకర్, తన సహచరుడు కిడాంబి శ్రీకాంత్‌పై గెలిచాడు. 2012లోనూ ఈ టైటిల్ నెగ్గిన కశ్యప్‌కు ఫైనల్లో శ్రీకాంత్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇద్దరూ ప్రతి పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. ఇద్దరికీ తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఉండటంతో ఆధిక్యం దోబూచులాడింది. అయితే చివర్లో అనుభవజ్ఞుడైన కశ్యప్‌నే విజయం వరించింది.
రెండు గేముల్లోనూ కశ్యప్ 20-21తో వెనుకబడ్డ దశలో పుంజుకొని వరుసగా మూడేసి పాయింట్లు సాధిం చి విజయం సాధించడం విశేషం. సింగిల్స్ విజేతలైన సైనా, కశ్యప్‌లకు 9 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 52 వేలు)తోపాటు 7000 ర్యాం కింగ్ పాయింట్లు లభించాయి.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో తెలుగు అమ్మాయి కె.మనీషా-మనూ అత్రి జంట రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మనీషా-మనూ అత్రి (భారత్) ద్వయం 17-21, 17-21తో రికీ విదియాంతో-పుస్పిత రిచిత దిలి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.