ఢిల్లీలో అకాడమీని ప్రారంభించిన సైనా
గౌర్ సిటీలో ఏర్పాటు
కోచ్‌గా కొత్త అవతారం
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ కెరీర్‌లో మరో ముందడుగు వేసింది. క్రీడాకారిణిగా కొనసాగుతూనే.. తన తొలి అకాడమీని కూడా ప్రారంభించింది. గ్రేటర్ నోయిడాలోని గౌర్ సిటీలో సకల సౌకర్యాలతో దీన్ని ఏర్పాటు చేసింది. గౌర్ సిటీలోని 18 ఏకరాల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో డేనైట్ క్రికెట్ స్టేడియం, ఫుట్‌బాల్ ఫీల్డ్, అథ్లెటిక్స్ ట్రాక్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులు, బాక్సింగ్ రింగ్, 25 మీటర్ల షూటింగ్ రేంజ్, వుడెన్ బాస్కెట్‌బాల్ కోర్టుతో పాటు 25 వేల కుటుంబాలు నివసించేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ సిటీలో బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ప్రారంభమైంది.
అకాడమీ కోచ్‌గా తానే పని చేస్తానని సైనా తెలిపింది. ‘వీలైనంత ఎక్కువ సమయం పిల్లలకు కోచింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆరంభంలో ఇది ఎలా నడుస్తుందో చూద్దాం. పిల్లలు బాగా రాణిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను తెచ్చేందుకు ప్రయత్నిస్తా. మరింత ప్రొఫెషనల్‌గా దీన్ని తీర్చిదిద్దుతా. ఈ అకాడమీ ద్వారా నాణ్యమైన క్రీడాకారులను తయారు చేస్తా’ అని సైనా వ్యాఖ్యానించింది.