సైనా ముందుకు.. సింధు ఇంటికి
ఫుజోవు(చైనా): చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కు చేరింది. గురవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ సైనా నెహ్వాల్ 21-10, 19-21, 21-19 తేడాతో జింగ్ యి(మలేషియా)పై విజయం సాధించి క్వార్టర్స్ లోకి ప్రవేశించింది. 55 నిమిషాల పాటు జరిగిన పోరులో సైనా తొలి సెట్ ను అవలీలగా గెలిచినా.. రెండో సెట్ లో పోరాడి ఓడింది. కాగా, నిర్ణయాత్మకమైన మూడో సెట్ లో సైనా తొలుత వెనుబడినా.. చివర్లో పుంజుకుని గేమ్ ను చేజిక్కించుకుంది. దీంతో పైనా నెహ్వాల్ తన తదుపరి పోరులో నజోమి ఒకుహరా(జపాన్) తో తలపడనుంది.
ఇదిలా ఉండగా, మరో మ్యాచ్ లో ప్రపంచ చాంపియన్ షిప్ కాంస్య పతక విజేత పివి సింధు ఓటమి పాలైంది. సింధు 21-18, 18-21, 16-21 తేడాతో షియాన్ వాంగ్(చైనా) చేతిలో పరాజయం చెంది ఇంటి దారి పట్టింది. గత నెలలో జరిగిన డెన్మార్క్ ఓపెన్ లో అంచనాలకు మించి రాణించి ఫైనల్ కు చేరిన సింధు.. చైనా ఓపెన్ లో ఆదిలోనే నిష్క్రమించడం భారత అభిమానుల్ని నిరాశపరిచింది.