న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాలబాలికల జట్లను ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్, సామియా ఇమాద్ ఫారూఖీలకు స్థానం లభించింది. ఈ మెగా ఈవెంట్ జూలై 20 నుంచి 28 వరకు చైనాలోని సుజౌలో జరుగుతుంది. మేలో జరిగిన చెన్నై, త్రివేండ్రం ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిన బాలబాలికలను ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జనరల్ సెక్రటరీ అజయ్ సింఘానియా తెలిపారు.
బాలుర విభాగంలో 11 మందిని, బాలికల విభాగంలో 12 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన జట్టు జూలై 3 నుంచి 17 వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. భారత జట్టుకు జూనియర్ చీఫ్ కోచ్‌గా సంజయ్ మిశ్రా వ్యవహరించనున్నారు. మిగతా కోచ్‌లుగా హైదరాబాద్‌కు చెందిన చేతన్ ఆనంద్, అరుణ్ విష్ణు, సయాలి గోఖలే, సచిన్ రాణా, టి.మారన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment