
సానియా-సాకేత్ జోడీకి గోల్డ్ మెడల్
సానియా మీర్జా- సాకేత్ మైనేని జోడీ భారత్ కు మరో బంగారు పతకం సాధించిపెట్టింది.
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత్ ఆరో స్వర్ణం సాధించింది. టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో విభాగంలో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. సానియా మీర్జా- సాకేత్ మైనేని జోడీ భారత్ కు మరో బంగారు పతకం సాధించిపెట్టింది. సోమవారం జరిగిన ఫైనల్లో చైనీస్ తైపీ జోడీని 6-4, 6-3తో ఓడించి విజే్తగా నిలిచారు.
తెలుగు తేజం సాకేత్ మైనేని పురుషుల డబుల్స్ విభాగంలోనూ పతకం ఖాయం చేసుకున్నాడు. సనమ్ సింగ్‌తో కలిసి ఫైనల్లో అడుగుపెట్టాడు. తుదిపోరులో విజయం సాధిస్తే మరో బంగారు పతకం అతడి ఖాతాలో చేరుకుంది. ఒకవేళ ఫైనల్లో ఓడినా వెండి పతకం దక్కుతుంది.
కాగా, సానియా మీర్జా దోహాలో 2006లో జరిగిన ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇప్పటివరకు నాలుగు ఆసియన్ గేమ్స్ లో పాల్గొన్న ఆమె మొత్తం 9 మెడల్స్ తన ఖాతాలో వేసుకుంది.