వెటెల్ ‘హ్యాట్రిక్’
సింగపూర్: తొలి ల్యాప్‌లో కాస్త తడబాటును మినహాయిస్తే... ఆద్యంతం స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచిన రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో ఏడో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 61 ల్యాప్‌ల రేసును వెటెల్ గంటా 59 నిమిషాల 13.132 సెకన్లలో పూర్తి చేశాడు. వరుసగా మూడో ఏడాది ఈ టైటిల్‌ను నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా గత మూడు రేసులను (బెల్జియం, ఇటలీ, సింగపూర్) నెగ్గి మరో ‘హ్యాట్రిక్’ సాధించాడు.
విజేత వెటెల్‌కు, రెండో స్థానంలో నిలిచిన అలోన్సోకు మధ్య తేడా 32 సెకన్లు ఉండటం ఈ రేసులో వెటెల్ ఆధిపత్యానికి నిదర్శనం. ఈ సీజన్‌లో ఏడు విజయాలు నమోదు చేసిన వెటెల్ 247 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 187 పాయింట్లతో అలోన్సో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో మరో ఆరు రేసులు మిగిలి ఉన్నాయి. ఇదే జోరును కొనసాగిస్తే వెటెల్ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచ చాంపియన్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన వెటెల్‌కు రెండో స్థానంలో ఉన్న రోస్‌బర్గ్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఆరంభంలో ఓవర్‌టేక్‌తో రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లగా రెండో మలుపు వద్ద వెటెల్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రోస్‌బర్గ్‌ను ఓవర్‌టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి వెటెల్‌కు తిరుగులేకుండా పోయింది. తొలుత 10 సెకన్ల ఆధిక్యాన్ని సంపాదించిన వెటెల్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని పెంచుకుంటూపోయాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సుటిల్ 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ నెగ్గగా... పాల్ డి రెస్టా 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. సీజన్‌లోని తదుపరి రేసు కొరియా గ్రాండ్‌ప్రి అక్టోబరు 6న జరుగుతుంది.