లండన్: వన్డే వరల్డ్‌కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించబోతున్న తమ దేశ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు ఫేర్‌వెల్ డిన్నర్ ఇస్తే సరిపోతుందని పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ పేర్కొన్నాడు. అతనికి ఫేర్‌వెల్ మ్యాచ్ లేకపోయినా ఫర్వాలేదు కానీ, కనీసం ఫేర్‌వెల్ డిన్నర్ ఇవ్వమంటూ సూచించాడు. ఏ క్రికెటర్‌కైనా తన కెరీర్‌లో ఆడబోయే చిట్టచివరి మ్యాచ్ గానీ, సిరీస్ గానీ, టోర్నమెంట్ గానీ అత్యుత్తమంగా భావిస్తారని, దురదృష్టవశావత్తూ షోయబ్ మాలిక్ దీనికి నోచుకోలేదన్నాడు. పాకిస్తాన్ జట్టుకు షోయబ్ మాలిక్ పలు విజయాలు అందించాడని, దాన్ని ఎవరూ విస్మరించబోరని అన్నారు. ప్రపంచకప్ టోర్నమెంట్‌లో షోయబ్ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడారని, అందులోనూ అతను ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని చెప్పాడు.
పాకిస్తాన్ క్రికెట్‌కు షోయబ్ మాలిక్ చాలా సేవ చేశారని, కొన్ని చిరస్మరణీయమైన విజయాలను అందించారని, దీనికి గుర్తుగా ఓ మంచి ఫేర్‌వెల్ డిన్నర్ ఇవ్వొచ్చని వ్యాఖ్యానించాడు. మాలిక్‌కు ఏమైనా ఫేర్‌వెల్ మ్యాచ్ ఉంటుందా అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అక్రమ్ సమాధానమిచ్చాడు. ఒక ప్లేయర్ వీడ్కోలు కోసం వన్డే మ్యాచ్ ఏర్పాటు చేయడానికి ఇదేమీ క్లబ్ క్రికెట్ కాదని అక్రమ్ అన్నాడు. అతని కోసం ఫేర్‌వెల్ డిన్నర్ ఇస్తే చాలని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమైన షోయబ్ మాలిక్.. గత నెల 16వ తేదీన మాంచెస్టర్‌లో టీమిండియాతో చివరిసారి ఆడాడు. ఆ తర్వాత అతన్ని జట్టులోకి తీసుకోలేదు. షోయబ్ స్థానంలో హారిస్ సొహైల్‌కు తుది జట్టులో చోటు కల్పించింది పాక్ టీమ్ మేనేజ్‌మెంట్.
అతను అద్భుతంగా రాణిస్తుండటంతో ఇక షోయబ్ అవసరం జట్టుకు లేకుండా పోయింది. రిటైర్ అవుతున్న నేపథ్యంలోమాలిక్‌ను బంగ్లాదేశ్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో ఆడిస్తారని అందరూ ఆశించారు. అలా జరగలేదు. జట్టులో షోయబ్ ఉన్నాడనే విషయాన్నే విస్మరించినట్టుంది పాక్ టీమ్ మేనేజ్‌మెంట్. అతణ్ని యథావిధిగా పక్కన పెట్టింది. ఎలాంటి మార్పులు లేకుండానే బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. ఫేర్‌వెల్ మ్యాచ్ కోసమైనా షోయబ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment