Check Here Reason Shoaib Malik Not Spotted At Sania Mirza Farewell Event - Sakshi
Sakshi News home page

ఫేర్‌వెల్‌ ఫంక్షన్‌లో బిజీబిజీగా సానియా.. భర్త షోయబ్‌ మాలిక్‌ ఎక్కడ..? 

Published Mon, Mar 6 2023 8:55 AM

Shoaib Malik Been Searched On Internet, While Sania Mirza Is Busy In Farewell Events - Sakshi

Sania Mirza-Shoaib Malik: భారత స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవలే ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న (మార్చి 5) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన ఫేర్‌వెల్‌ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల్లో పాల్గొన్న సానియా.. చివరిసారిగా రాకెట్‌ పట్టుకుని అందరినీ అలరించింది. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ల్లో భాగంగా జరిగిన సింగిల్స్‌ పోటీలో రోహన్‌ బోపన్నతో తలపడిన  సానియా.. ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బోపన్నతో జతకట్టి.. ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీని ఢీకొట్టింది. నామమాత్రంగా జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో సానియానే విజయం సాధించింది. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజహారుద్దీన్‌, హీరో దుల్కర్‌ సల్మాన్‌, భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తదితరులు సానియాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ల అనంతరం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన రెడ్ ప్రత్యేక కార్పెట్ ఈవెంట్‌లో పాల్గొన్న సానియా.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులతో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ రెహ్మాన్‌, ప్రిన్స్‌ మహేశ్‌ బాబు సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. 

కాగా, సానియా గౌరవార్ధం నిన్న జరిగిన కార్యక్రమాల్లో ఆమె భర్త షోయబ్‌ మాలిక్‌ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నిన్నటి నుంచి నెటిజన్లు షోయబ్‌ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో జనాలకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. ప్రస్తుతం షోయబ్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాడని తెలిసిం‍దే. షోయబ్‌కు సంబంధించిన ఓ వీడియో సానియా ఫేర్‌వెల్‌ ఈవెంట్‌కు కొద్ది రోజుల కిందట నెట్టింట చక్కర్లు కొట్టింది.

పీఎస్‌ఎల్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించే షోయబ్‌.. ఆ ఫ్రాంచైజీ మెంటార్‌, పాక్‌ మాజీ కెప్టెన్‌ వసీం అక్రమ్‌తో వాదన తరహా డిస్కషన్‌కు దిగినట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తోంది. భార్య సానియా కోసం‍ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో షోయబ్‌ పాల్గొనకపోవడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండింగ్‌లో నిలిచింది. సానియా-షోయబ్‌ జంట విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఇరువురు మీకు మీరే మాకు మేమే అన్న  రీతిలో వ్యవహరించడంతో వీరి మధ్య అంతా అయిపోయిందని, విడాకులే బాకీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement