ధనవంతుల బిడ్డ కాదు... పెద్దల అండదండలూ లేవు... ఎవరి నుంచైనా పైరవీలు తెచ్చుకోగలిగే స్థాయి కాదు... అతనికి తెలిసిందల్లా అమిత వేగంతో, కచ్చితత్వంతో బంతులను వికెట్లపైకి నేరుగా సంధించడమే... గంటల కొద్దీ విరామం లేకుండా బౌలింగ్, బౌలింగ్, బౌలింగ్ మాత్రమే! కేవలం ప్రతిభ ఉంటే చాలు, ఇంకేమీ లేకపోయినా భారత క్రికెట్ జట్టు స్థాయికి ఎదగవచ్చని, అది సాధ్యమని నమ్మవచ్చంటూ ఈ 23 ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు నిరూపించాడు.
ఒకప్పుడు చిన్న మొత్తం కోసం అతను ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ గల్లీ క్రికెట్, టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడాడు... ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టినా ఆటలో మాత్రం ఉదాసీనత చూపించలేదు. అదే పట్టుదల, అదే సాధనను కొనసాగించాడు. ఐపీఎల్ తర్వాత వచ్చిన గుర్తింపుతో సరిపెట్టుకోకుండా ఇప్పుడు టీమిండియాకు ఎంపికై మొహమ్మద్ సిరాజ్ సత్తా చాటాడు.
సాక్షి, హైదరాబాద్: గత ఏడాది కాలంగా మొహమ్మద్ సిరాజ్ ఆటను చూస్తే ఏదో ఒక రోజు భారత్‌కు ఆడగల స్థాయి అతనికుందని అంతా ఊహించారు. అయితే ఆ అవకాశం చాలా తొందరగా వచ్చిందనేది మాత్రం వాస్తవం. ఒక సంవత్సరం వెనక్కి వెళితే అతను దిగువ స్థాయి గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్ రంజీ ట్రోఫీలో జట్టు సభ్యుడు మాత్రమే. కానీ అంది వచ్చిన ప్రతీ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న సిరాజ్ తన బౌలింగ్‌లాగే వేగంగా దూసుకుపోయాడు. కేవలం 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే 22.30 సగటుతో 53 వికెట్లు... 16 టి20ల్లో తీసిన 26 వికెట్లు సెలక్టర్లను ఆకట్టుకున్నాయి.
భరత్ అరుణ్ పర్యవేక్షణలో...
సిరాజ్ తండ్రి మొహమ్మద్ గౌస్ ఆటోడ్రైవర్. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. అయినా సరే ఆయన కొడుకును క్రికెట్ దిశగా ప్రోత్సహించారు. ‘ఇక్కడ ఇంత వేగంగా బౌలింగ్ చేస్తే చాలా కష్టం. మేం ఆడలేం’ అంటూ గల్లీ క్రికెట్‌లో ప్రత్యర్థుల ప్రశంసలు పొందిన తర్వాత హెచ్‌సీఏ అధికారిక లీగ్‌లో (2 రోజులు) ఆడే అవకాశం దక్కింది. అక్కడ పడిన సిరాజ్ అడుగు ఇక ఆగలేదు. అతను బౌలింగ్‌కు దిగడం... టపటపా వికెట్లు పడగొట్టడం రొటీన్‌గా మారిపోయింది. ఆ తర్వాత 3 రోజుల లీగ్, హైదరాబాద్ అండర్–23 జట్టులో చోటు, కొన్నాళ్లకే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అవకాశం చకచకగా జరిగిపోయాయి. గత సీజన్ (2016–17) సిరాజ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. అతనిలోని సహజ ప్రతిభను గుర్తించి అప్పటి హైదరాబాద్ కోచ్ భరత్ అరుణ్ మరింత తీర్చిదిద్దారు. లోపాలను సరిదిద్దడంతో పాటు సరైన మార్గనిర్దేశనం చేశారు. ఆయన ప్రోత్సాహంతో కేవలం 18.92 సగటుతో 41 వికెట్లతో రంజీల్లో మూడో స్థానంలో నిలిచాడు. తాజాగా భారత జట్టుకు ఎంపిక కావడంలో కూడా టీమ్ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పాత్ర కూడా ఉందనే చెప్పవచ్చు.
ఐపీఎల్ తర్వాత కూడా...
ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 2 కోట్ల 60 లక్షలకు సిరాజ్‌ను తీసుకోవడం సంచలనం రేపింది. ఇందులో 6 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీసిన అతను ఆ తర్వాత అదే జోరును కొనసాగించాడు. భారత ‘ఎ’ జట్టు తరఫున దక్షిణాఫ్రికా పర్యటనలో ఏకైక టెస్టులో 5 వికెట్లు, 3 వన్డేల్లో 5 వికెట్లు, దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో 2 వికెట్లు, న్యూజిలాండ్ ‘ఎ’తో టెస్టులో 2 వికెట్లు, వన్డేల్లో 2 వికెట్లు... ఇలా వరుస పెట్టి సిరాజ్ వికెట్ల పండగ చేసుకున్నాడు. ఇదే భారత జట్టు ఎంపికకు కారణమైంది. కివీస్ ‘ఎ’తో టెస్టుల్లో స్టంప్ విరగ్గొట్టే వేగంతో అతను బంతులు సంధించాడు. ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో కొత్తగా సొంతిల్లు కొనుక్కోవడంతో పాటు తండ్రిని ఆటోడ్రైవర్ వృత్తి నుంచి దూరం చేయడాన్ని గర్వంగా భావిస్తానన్న సిరాజ్... లీగ్ ఆకర్షణలో ఏకాగ్రత కోల్పోకుండా అంతే పట్టుదలగా తను ఆటను మెరుగుపర్చుకోవడం విశేషం.
భారత జట్టులో చోటు దక్కించుకోవాలన్న నా కల నిజమైంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆడతానని నమ్మాను కానీ ఇంత తొందరగా ఎంపికవుతానని అసలు ఏమాత్రం ఊహించలేదు. ఈ విషయం చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు ఉద్వేగంతో ఏమీ మాట్లాడలేకపోయారు. ఐపీఎల్ కంటే కూడా రంజీ ట్రోఫీ ప్రదర్శన వల్లే నాకు గుర్తింపు వచ్చిందని నమ్ముతున్నా. అన్ని రకాలుగా నా ఆటను తీర్చిదిద్దిన భరత్ అరుణ్ సార్‌కు రుణపడి ఉంటాను. ఇటీవల ‘ఎ’ పర్యటనల్లో నా సహజశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని కోచ్ ద్రవిడ్ సార్ సూచించారు. భారత్ తరఫున కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా.
– ‘సాక్షి’తో సిరాజ్
Comments
Please login to add a commentAdd a comment