‘విజ్జీ’ తర్వాత... | Sourav Ganguly 1st India cricketer in 65 years to become BCCI president | Sakshi
Sakshi News home page

‘విజ్జీ’ తర్వాత...

Published Tue, Oct 15 2019 4:17 AM | Last Updated on Tue, Oct 15 2019 4:17 AM

Sourav Ganguly 1st India cricketer in 65 years to become BCCI president - Sakshi

భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేయబోతున్న రెండో వ్యక్తి సౌరవ్‌ గంగూలీ. గంగూలీకి ముందు 1954–56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్‌ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు (2014 ఐపీఎల్‌ బాధ్యతలు చూడమంటూ సుప్రీం కోర్టు తాత్కాలికంగా సునీల్‌ గావస్కర్‌ను అధ్యక్షుడిని నియమించడాన్ని మినహాయిస్తే). ‘విజ్జీ’గా సన్నిహితులతో పిలిపించుకున్న మహరాజుకు పరిపాలనాధికారిగా మంచి పేరే వచ్చింది. అయితే అంతకు రెండు దశాబ్దాల క్రితం ఆటగాడిగా వ్యవహరించిన సమయంలో ఆయన వ్యవహారశైలికి సంబంధించి అనేక ఆసక్తికర కథనాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం వివాదాస్పదమైనవే.

అపార సంపద ఉండటంతో దిగ్గజాలు జాక్‌ హాబ్స్, హెర్బర్ట్‌ సట్‌క్లిఫ్‌లను పిలిపించి తన సొంత ప్యాలెస్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌లలో ఆయన ఆడింపజేసేవారు. 1930ల్లో భారత క్రికెట్‌లో రాజు ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది. 1932 ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత జట్టుకు అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తూ ‘డిప్యూటీ వైస్‌ కెప్టెన్‌’గా రాజు సిద్ధమయ్యారు. అయితే అనారోగ్యంతో వెళ్లలేకపోయినా... 1936 సిరీస్‌కు కెప్టెన్‌ హోదాలో ఇంగ్లండ్‌ వెళ్లారు. అయితే ఆ సిరీస్‌ మొత్తం వివాదమే. టీమ్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ లాలా అమర్‌నాథ్‌ను క్రమశిక్షణ పేరుతో ఒక్క టెస్టు కూడా ఆడకుండానే స్వదేశం పంపించారు.

ఆ పర్యటనలో ఆడిన అన్ని మ్యాచ్‌లు కలిపి 16.21 సగటుతోనే 600 పరుగులు చేశారు. అందులోనూ ప్రత్యర్థి కెప్టెన్లకు ‘తనకు ఫుల్‌ టాస్‌లు, సులువైన బంతులు వేయాలంటూ’ బంగారు వాచీలు కూడా బహుమతిగా ఇచ్చి చేసిన పరుగులే! ఇంగ్లండ్‌తో 3 టెస్టుల్లో కలిపి చేసింది 33 పరుగులే. స్వదేశం వచ్చాక తీవ్ర విమర్శలు రావడంతో ఆట నుంచి తప్పుకున్న మహరాజు మళ్లీ భారత్‌ తరఫున ఆడలేదు. ‘ఆయనకు ఉన్న రోల్స్‌రాయిస్‌ కార్లకంటే చేసిన పరుగులు తక్కువ’ అంటూ అప్పట్లో ఒక జోక్‌ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే పరిపాలకుడిగా ప్రశంసలు అందుకున్న మహరాజును మరచిపోకుండా బీసీసీఐ ‘విజ్జీ ట్రోఫీ’ పేరిట ఇంటర్‌ యూనివర్సిటీ జోనల్‌ టోర్నమెంట్‌ను ప్రస్తుతం నిర్వహిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement