సౌరభ్ గంగూలీ
నాయకత్వ లక్షణాలకు నిఖార్సైన నిదర్శనం...
జట్టుకు ఏం కావాలో పసిగట్టే ఆలోచనాపరుడు...
ప్రతిభావంతులను గుర్తించే నేర్పరి...
ప్రయోగాలకు వెరవని నైజం...
పంతాన్ని సాధించే పట్టుదల...
ఈ విశేషణాల కలబోతే సౌరభ్ గంగూలీ. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభంతో కుంగిపోయిన భారత క్రికెట్‌ను ముందుగా తన సమర్థ సారథ్యంతో బయటపడేసి, అనంతరం కుర్రాళ్లకు మార్గ నిర్దేశనంతో మనం ఏదైనా సాధించగలం అనే ఆత్మవిశ్వాసం నింపి టీమిండియాకు పునర్‌వైభవం తెచ్చాడీ కోల్‌కతా రాకుమారుడు. దేనికీ తొందరగా తలొగ్గని స్వభావి అయిన సౌరభ్... ఒక దశలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు. వాటికి ఎదురీది మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆటకు హుందాగా వీడ్కోలు పలికాడు. చాపెల్‌తో అనుభవాలు, తండ్రి సూచనను ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’లో ఇప్పటికే ప్రస్తావించిన గంగూలీ... అప్పట్లో మహేంద్ర సింగ్ ధోనిపై తన అంచనాలు, కోల్‌కతా ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్ సహచర్యం, పాక్ పేసర్ అక్తర్ తీరు, చరిత్రాత్మక కోల్‌కతా టెస్టు విశేషాలు, కెరీర్ ముగింపు, కెప్టెన్సీ గురించి విపులంగా వివరించాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే...
ఒత్తిడిని చిత్తుచేయగల, మ్యాచ్ మలుపుతిప్పగల ఆటగాడి కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూశా. అలాంటి తరుణంలో ధోని కనిపించాడు. మొదటి రోజు నుంచే అతడు నన్ను ఆకట్టుకున్నాడు. నిజానికి నా సారథ్యంలో 2003 ప్రపంచకప్ ఆడిన భారత జట్టులో ధోని ఉండుంటే ఆ కథే వేరుగా ఉండేది. ఆ సమయంలో అతను రైల్వే టీసీగా ఉద్యోగం చేస్తున్నాడని తెలిసింది. ఏదేమైనా ఆ తర్వాత నా అంచనాలను అతడు అందుకున్నాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌కు నేను వ్యాఖ్యాతగా ఉన్నా. భారత్ విజయం సాధించబోయే క్షణంలో నన్ను కామెంటరీ బాక్స్‌లో ఉండమని ప్రసారకర్తలు కోరారు. అయితే నేను మాత్రం ‘చూడండి... ఇప్పటివరకు మీరు చెప్పిందంతా చేశా. ఇప్పుడు మాత్రం చేయలేను. నో చాన్స్’ అనేశా. మన జట్టు కప్ గెలిచిన అనుభూతి, కుర్రాళ్లు ట్రోఫీని అందుకున్న క్షణాలను ఆస్వాదించేందుకే బౌండరీ లైన్ వద్దకు వచ్చేశా. నా కుర్రాళ్లు భాగంగా ఉన్న ధోని సారథ్యంలోని జట్టు ప్రపంచకప్ గెలవడంతో నేను కూడా విజయంలో భాగమైనట్లు భావించా. నేను 2003లో కోల్పోయిన గెలుపును అక్కడ మళ్లీ పొందినట్లనిపించింది.
షారుక్ ఓ అద్భుతం... అక్తర్ అర్ధం కాలేదు...
సినిమా హీరోగా షారుక్ ముందే తెలిసినా బీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా 2000లో నేరుగా కలిశా. అతడి చురుకుదనం, ఆకర్షణ శక్తికి ప్రభావితమయ్యా. తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా ‘కోల్‌కతా’ ఫ్రాంచైజీని షారుక్ కొన్నట్లు, నాకే కెప్టెన్సీ ఇచ్చినట్లు లలిత్ మోదీ ఫోన్ చేసి చెప్పాడు. నా అనుభవంతో అతడికి సాయపడమని కోరాడు. స్వశక్తితో పైకెదిగిన షారుక్ చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించాడు. నన్నెపుడూ గౌరవంగా చూశాడు. ముఖ్యంగా అతడు బంగ్లా (మన్నత్)ను కొన్న తీరు... మా జట్టు యజమాని కలలను నిజం చేసుకునేవాడని చాటింది. షారుక్ సాహచర్యంలో ఆటగాళ్లు చాలా స్ఫూర్తిపొందారు. జట్టు యాజమాన్యం వద్దంటున్నా షోయబ్ అక్తర్‌ను తీసుకోమని ఒత్తిడి చేసింది నేనే. దానికతడు కొంత న్యాయం చేశాడు. కానీ... ఉన్నట్టుండి చిన్న గాయం సాకుగా చూపుతూ ఆడనని చెప్పేశాడు. చిన్నవాటిని లెక్కచేయొద్దని ఎంతో చెప్పా. అయినా మైదానంలోకి తీసుకురాలేకపోయా.
కోల్‌కతా టెస్టు గురించి...
ఆస్ట్రేలియా 2001 సిరీస్‌లో మనల్ని ముంబై టెస్టులో ఓడించింది. ఆ రాత్రే నేను కోల్‌కతా వెళ్లిపోయా. పిచ్‌ను ముందే అధ్యయనం చేశా. కానీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 చేస్తే, మేం 171 పరుగులకే అవుటయ్యాం. దీంతో మ్యాచ్, సిరీస్, నా కెప్టెన్సీ అన్నీ పోయినట్లే అనుకున్నాం. ఫాలోఆన్ ఆడే ముందు మా అత్తయ్య కలిసింది. క్రికెట్ తప్ప చాలా మాట్లాడుకున్నాం. చివరకు ‘సౌరభ్ నువ్వు ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలి’ అని కోరింది. ‘మీ అమ్మకు ఇదంతా ఎందుకు?’ అని నా భార్యపై మండిపడ్డా. రెండ్రోజుల తర్వాత చూస్తే మేం టెస్టు క్రికెట్‌లో చరిత్రాత్మక విజయం సాధించాం. ఆ తర్వాతెప్పుడూ ‘నా మాటలు మర్చిపో’ అని మా అత్తయ్య నాకు చెప్పలేదనుకోండి. మ్యాచ్ అనంతరం మా ఇంటికి వెళ్లాం. అప్పుడామె ‘ఇలా జరుగుతుందని రెండ్రోజుల క్రితమే చెప్పా’ అంటూ ఆటగాళ్లందరికీ వివరించింది. లక్ష్మణ్, రాహుల్ అభినందనలకు అర్హులు. రెండో ఇన్నింగ్స్‌లో వీవీఎస్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపడం కఠిన నిర్ణయమే. దీనిపై ద్రవిడ్ నొచ్చుకున్నాడు. అయితే... వీరిద్దరూ 281, 180 పరుగులతో చరిత్ర సృష్టించారు. ఈ సిరీస్ కెప్టెన్‌గా, ఆటగాడిగా నాలో మార్పు తెచ్చింది. భారత క్రికెట్‌ను మార్చిన ఈ విజయం నా సారథ్యంలో గొప్పదైతే, 2003 ప్రపంచకప్ గెలవకపోవడం ఇప్పటికీ బాధించే పెద్ద వైఫల్యం. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం సరైన నిర్ణయంగానే భావిస్తా.
వన్డే కెరీర్ అలా ముగుస్తుందనుకోలేదు...
2007లో వన్డేల్లో 1240 పరుగులు సాధించా. టెస్టుల్లో 1106 పరుగులు చేశా. నా ఆఖరి వన్డే సిరీస్ పాకిస్తాన్‌తో గ్వాలియర్‌లో ముగిసింది. తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ, సెంచరీ చేశా. ఇదే ఫామ్ ఆస్ట్రేలియా పర్యటనలో చూపా. కానీ అనూహ్యంగా ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో భవిష్యత్తు వన్డే ప్రణాళికల్లో లేనని తెలిసిపోయింది.
‘చివరి’ కెప్టెన్సీ గురించి...
నా చివరి టెస్టు (2008లో ఆస్ట్రేలియాపై నాగ్‌పూర్)లో మర్యాదపూర్వకంగా కెప్టెన్సీ చేయమని ధోని అడిగాడు. ఆశ్చర్యపోయి... మొదట వద్దన్నా. మళ్లీ కోరడంతో అంగీకరించా. కానీ సరిగ్గా దృష్టిసారించలేకపోయా. మూడు ఓవర్ల తర్వాత ‘ఇది నీ బాధ్యత’ అంటూ అతడికే అప్పగించేశా. దీనికి ఇద్దరం నవ్వుకున్నాం.
Comments
Please login to add a commentAdd a comment