
కోల్‌కతా: భారత క్రికెట్‌లో ఇప్పుడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లే ఉంది. ఒకవైపు అతను మ్యాచ్‌లు ఆడటం లేదు. అలా అని అధికారికంగా రిటైర్మెంట్ కూడా ప్రకటించలేదు. తాను ఆడాలనుకునే సిరీస్‌లు తనే ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్ తర్వాత అతను మళ్లీ బరిలోకి దిగలేదు. అతను సెలక్టర్లకు ఏం చెప్పాడో వారికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో కొత్తగా బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ దీనిపై స్పందించాడు. ధోని విషయంలో తనకు మరింత స్పష్టత కావాల్సి ఉందంటూ వ్యాఖ్యానించాడు.
‘నేను బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజు ఈ నెల 24న సెలక్టర్లతో సమావేశమవుతున్నా. ధోనికి సంబంధించి వారి ఆలోచనలు ఏమిటో నేను తెలుసుకుంటా. ఆ తర్వాత నా అభిప్రాయం వెల్లడిస్తా. అసలు ధోని ఏమనుకుంటున్నాడో కూడా తెలియాలి. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నేను పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక అధికారిక హోదాలో దీని గురించి సమాచారం తెలుసుకొని ఏం చేయాలో నిర్ణయిస్తా’ అని గంగూలీ స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment