
తెరపై కాసులు కురిపిస్తున్న క్రీడాకారులు
క్రీడా దిగ్గజాల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య బాలీవుడ్ పెరిగింది. క్రీడా నేపథ్యంలో గతంలోనే సినిమాలు వచ్చాయి. అయితే క్రీడాకారులు జీవిత చరిత్రలను సెల్యులాయిడ్ పై చూపించడమనే సరిక్రొత్త ట్రెండ్ బాలీవుడ్ లో ఇటీవలే మొదలైందని చెప్పాలి. ఈ కోవలో వచ్చిన సినిమాలు విజయవంతం కావడంతో ఇటువైపు దర్శకులు దృష్టి సారించారు. ప్రఖ్యాత క్రీడాకారుల జీవితాలను సినిమాగా మలిచేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్, టిమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథలు ఈ వరుసలో ఉన్నారు.
మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' సినిమా రూ. 100 కోట్ల పైగా వసూళ్లు సాధించడంతో ఈ తరహా చిత్రాలు రూపొందించేందుకు బాలీవుడ్ దర్శకులు ఉత్సుకత చూపిస్తున్నారు. స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవితచరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం మరింత ఉత్సాహనిచ్చింది. ధ్యాన్ చంద్ పై సినిమా తీస్తున్నట్టు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే ప్రకటించారు. 'ఎంఎస్ ధోని- ది అన్టోల్డ్ స్టోరీ'తో నీరజ్ పాండే మెగా ఫోన్ పట్టేందుకు సిద్దమవుతున్నారు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటిస్తాడని పాండే వెల్లడించారు.
ఆటగాళ్ల జీవితాలను వరుసగా తెరకెక్కించడం వెనుక రహస్యమేమీ లేదని, బాక్సాఫీస్ వద్ద ఇటువంటి సినిమాలు విజయం సాధిస్తుండడమే కారణమని పీవీఆర్ సినిమా సీఓఓ దీపక్ శర్మ పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు స్ఫూర్తి రగిలిస్తాయని చెప్పారు. మంచి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా తీసే సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పారు. ప్రస్తుతం జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల పరంపర బాలీవుడ్ లో నడుస్తోందన్నారు. క్రీడాస్ఫూర్తితో కాకుండా కాసుల కోసమే 'బయోపిక్'లు తెరకెక్కిస్తున్నారని విమర్శిస్తున్న వారు లేకపోలేదు.
కాగా, మరింత మంది క్రీడాకారులు తమ జీవిత చరిత్రలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని ఉబలాటపడుతుండడం విశేషం. తన పాత్రకు సల్మాన్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ సరిపోతారని కుస్తీ వీరుడు యోగేశ్వర్ దత్ పేర్కొన్నారు. ఒకవేళ తన బయోగ్రఫీ సినిమాగా తీస్తే.. ఆ పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సరిగ్గా సరిపోతుంది టెన్నిస్ తార సానియా వ్యాఖ్యానించింది. రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులు జీవితాలు తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది.