'వరల్డ్ కప్' ఫిక్సింగ్ పై ఫిర్యాదు చేస్తే..
కొలంబో: 2011 వరల్డ్ కప్లో భారత్ -శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాని డిమాండ్ చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రణతుంగ వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం తాజాగా స్పందించింది.
ఆ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగినట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రీడా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. 'రాత పూర్వకంగా ఫిర్యాదు చేయండి. ఆ ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నా' అని జయశేఖర బదులిచ్చారు. కొన్ని రోజుల క్రితం భారత్- శ్రీలంకల వరల్డ్ కప్-2011 ఫైనల్ మ్యాచ్ పై తనకు అనుమానాలు ఉన్నాయంటూ రణతుంగ ఆరోపించాడు. లంకేయులు ఆడిన తీరు పలు అనుమానాలకు తావిచ్చిందంటూ ఆరేళ్ల తరువాత రణతుంగా కొత్త పల్లవి అందుకున్నాడు.