సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. కేరళలోని త్రిసూర్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 16-21, 8-21తో తన్వీ లాడ్ (పీఎస్‌పీబీ) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి జక్కంపూడి మేఘన తన భాగస్వామి సాన్యమ్ శుక్లాతో కలిసి టైటిల్ సాధించింది.
ఫైనల్లో మేఘన-శుక్లా ద్వయం 21-7, 21-8తో శివమ్ శర్మ-హారిక జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్-సాన్యమ్ శుక్లా జంట 19-21, 14-21తో రూపేశ్ కుమార్-సనావే థామస్ ద్వయం చేతిలో ఓడిపోయింది.