
మహిళలకూ ఐపీఎల్ కావాలి
అంజుమ్ చోప్రా వ్యాఖ్య
న్యూఢిల్లీ: మహిళల క్రికెట్‌లో కూడా ఐపీఎల్ తరహా లీగ్ ఉంటే బాగుంటుందని భారత బ్యాట్స్‌వుమన్ అంజుమ్ చోప్రా అభిప్రాయపడింది. ఈ లీగ్ కూడా విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘ఐపీఎల్‌లాంటి లీగ్ మహిళల క్రికెట్‌కు చాలా సహాయపడుతుంది. ఎందుకంటే భారత్‌తోపాటు మరికొన్ని దేశాల్లో క్రికెట్‌కు అత్యంత ప్రజాదరణ ఉంది. కాబట్టి ఈ లీగ్ కూడా అదరణ పొందుతుంది.
ఏ ఆటకైనా మంచి కవరేజీ, ప్రజాదరణ లభిస్తే అది విజయవంతమవుతుంది. ఇప్పటికే ఎన్నో క్రీడల్లో రకరకాల లీగ్‌లు వచ్చాయి... వస్తున్నాయి. రానురాను భారత్‌లో క్రీడలకు మరింత ప్రజాదరణ పెరుగుతుంది’ అని అంజుమ్ వ్యాఖ్యానించింది. క్రికెట్‌లో సచిన్ తరువాతే ఎవరైనా అని చెప్పిన అంజుమ్... సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్‌లాంటి ఆటగాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఆటలోకి వచ్చానని వెల్లడించింది.