క్రీడాకారులకు నగదు పురస్కారాలు | summer sports trainning grand opening | Sakshi
Sakshi News home page

క్రీడాకారులకు నగదు పురస్కారాలు

Published Fri, May 23 2014 12:09 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM

summer sports trainning grand opening

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్  
 వేసవి క్రీడా శిబిరాలు ఘనంగా ప్రారంభం
 
 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జీహెచ్‌ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఆధ్వర్యంలో గత నెల 25 నుంచి అనధికారికంగా జరుగుతున్న వేసవి క్రీడా శిబిరాలను గురువారం అధికారికంగా ఇక్కడి విక్టరీ ప్లేగ్రౌండ్స్‌లో మేయర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ  జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే నగర క్రీడాకారులకు స్పోర్ట్స్ స్కీమ్ ద్వారా నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం నగరంలోని మాజీ అంతర్జాతీయ క్రీడాకారులతో సమావేశమై, వారి సలహాలను తీసుకోనున్నట్లు చెప్పారు.
 
 వేసవి శిబిరాలను ప్రత్యేకంగా ఉదయంతోపాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కూడా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ జి.రాజ్‌కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దిడ్డి రాంబాబు, కార్పొరేటర్లు వాజిద్ హుస్సేన్, పి.జ్ఞానేశ్వర్ గౌడ్, జె.హేమలత యాదవ్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ అన్నపూర్ణ, స్పోర్ట్స్ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఆర్.ప్రేమ్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
 మేయర్ ఆలస్యంతో బాలల ఇక్కట్లు
 ప్రారంభ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథి అయిన మేయర్ మాజిద్ హుస్సేన్ రెండు గంటలు ఆలస్యంగా హాజరు కావడంతో బాల బాలికలు ఎండలో నిరీక్షిస్తూ తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు జరగనున్నట్లు అధికారులు ప్రకటించడంతో వివిధ క్రీడా మైదానాల నుంచి బాల బాలికలు, వారి తల్లిదండ్రులు, కోచ్‌లు సమయానికి ముందే హాజరై మేయర్ కోసం నిరీక్షించారు. అయితే మేయర్ 9 గంటల తరువాత రావడంతో అప్పటిదాకా ఎదురు చూసిన వారంతా అసౌకర్యానికి గురయ్యారు. మేయర్ ఆలస్యంగా రావడంపై బాల బాలికల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement