టీ20 మ్యాచ్ టై: సూపర్ ఓవర్లో విజయం
బ్రిస్బేన్: బిగ్‌బాష్ లీగ్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బ్రిస్బేన్ హీట్‌పై సూపర్ ఓవర్‌లో 6 పరుగులతో నెగ్గి సిడ్నీ సిక్సర్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్లో విజయానికి 6 పరుగులు చేయాల్సిన తరణంలో సిడ్నీ సిక్సర్స్ 5 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్‌టై అయింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. మొదట సిడ్నీ సిక్సర్స్ జట్టు సూపర్ ఓవర్లో 21 పరుగులు చేసింది. హెన్రిక్స్ 18 పరుగులు చేశాడు. 22 పరుగుల టార్గెట్‌తో దిగిన బ్రిస్బేన్ టీమ్ సూపర్ ఓవర్లో తొలి ఐదు బంతులకు 9 పరుగులు చేసింది. చివరి బంతికి మెకల్లమ్ సిక్సర్ కొట్టినా జరగాల్సిన నష్టం జరిగింది. ఐదు పరుగులతో నెగ్గిన సిడ్నీ ఈ 28న ఫైనల్లో పెర్త్ స్కాచర్స్ తో తలపడనుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. బ్రిస్బేన్ హీట్ ఆటగాళ్లలో కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్ 46(27 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. సీన్ అబాట్, లియాన్ చెరో 4 వికెట్లు తీశారు. 168 పరుగుల టార్గెట్‌తో దిగిన సిడ్నీ సిక్సర్ బ్యాట్స్‌మన్‌లలో కెప్టెన్ హెన్రిక్స్ 64( 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), హ్యూస్ (46) రాణించారు. చివర్లో 12 బంతులకు 19 పరుగులు చేయాల్సిన తరుణంలో జాన్ బోథా మూడు ఫోర్లు బాదడంతో విజయావకాశాలు మెరుగు పడ్డాయి. ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా, బ్రిస్బేన్ బౌలర్ బెన్ కటింగ్ చాకచక్యంగా బౌలింగ్ చేయడంతో ఐదు పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లో విజయం సాధించిన సిడ్నీ సిక్సర్స్ బిగ్ బాష్ లీగ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.