షార్జా : ప్రత్యర్థి బౌలర్లను చితగ్గొడుతూ, కొండంత లక్ష్యాన్ని ధీమాగా పిండిచేసిన టీమిండియా.. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అంధుల క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా షార్జా వేదికగా శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో భారత్ సూపర్ విక్టరీ కొట్టింది. పాక్ విసిరిన 307 పరుగుల లక్ష్యాన్ని భారత్.. మరో 10 బంతులు మిగిలి ఉండగానే సాధించడం గమనార్హం. 2014లో తొలిసారి అంధుల ప్రపంచకప్‌ను గెల్చుకున్న భారత్ ఇప్పుడు రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. 1998 నుంచి జరుగుతోన్న ఈ పోటీల్లో భారత్, పాక్‌లు చెరో రెండుసార్లు, సౌతాఫ్రికా ఒకసారి విజేతలుగా నిలిచాయి.
ఇరగదీసిన బ్యాట్స్‌మన్లు : తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాట్స్‌మన్‌కు సహకరించడంతో పాక్ ఆటగాళ్లు చెలరేగిఆడారు. నిర్ణీత 40 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 307 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఏ దశలోనూ మ్యాచ్‌పై పట్టుసడలనీయలేదు. ధాటిగా ఆడుతూ మరో 10 బంతులు మిగలి ఉండగానే 309 పరుగులు చేసి విజేతగా నిలిచింది. మొత్తంగా రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 600 పైచిలుకు పరుగులు నమోదు కావడం మరో రికార్డు. ప్రపంచకప్ గెల్చుకున్న భారత జట్టుకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటూ పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment