సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. మహిళల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచే గెలుపొందగా... రెండింట ఓడింది. పురుషుల జట్టు ఒక్కో గెలుపు, ఓటమిలతో పాటు మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే పాయింట్ల సగటులో వెనుకబడటంతో నాకౌట్‌కు అర్హత సంపాదించలేకపోయింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆంధ్రప్రదేశ్... ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన రసవత్తర పోరులో ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది.
చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 44–43తో విజయాన్ని దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరాఖండ్ 51–23తో పంజాబ్‌పై, రాజస్తాన్ 45–43తో జార్ఖండ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 44–18తో బీఎస్‌ఎన్‌ఎల్‌పై, బిహార్ 39–27తో తమిళనాడుపై, ఒడిశా 49–39తో అస్సాంపై, గుజరాత్ 44–37తో పాండిచ్చేరిపై, పంజాబ్ 60–15తో త్రిపురపై, బిహార్ 45–43తో చండీగఢ్‌పై, బీఎస్‌ఎన్‌ఎల్ 41–34తో మణిపూర్‌పై, రైల్వేస్ 45–15తో ఆంధ్రప్రదేశ్‌పై, మహారాష్ట్ర 68–20తో గుజరాత్‌పై విజయం సాధించాయి.
మహిళల మ్యాచ్‌ల ఫలితాలు: హరియాణా 65–10తో పాండిచ్చేరిపై, ఉత్తరప్రదేశ్ 27–26తో పశ్చిమ బెంగాల్‌పై, కేరళ 17–13తో పంజాబ్‌పై, కర్ణాటక 20–19తో చండీగఢ్‌పై, హిమాచల్‌ప్రదేశ్ 39–21తో ఢిల్లీపై, గుజరాత్ 35–11తో ఉత్తరాఖండ్‌పై, మధ్యప్రదేశ్ 54–27తో జార్ఖండ్‌పై గెలుపొంది ముందంజ వేశాయి.
Comments
Please login to add a commentAdd a comment