National Kabaddi championship
-
కబడ్డీ పోటీలకు ముస్తాబు అవుతున్న తిరుపతి
-
ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్ర జట్ల ఓటమి
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ టోర్నీలో తెలంగాణ జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించగా... ఆంధ్రప్రదేశ్ (ఏపీ) పురుషుల, మహిళల జట్లు ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్ 31–52తో ఉత్తరాఖండ్ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో కర్ణాటక 37–27తో తమిళనాడుపై గెలుపొందింది. మహిళల విభాగంలో కేరళ 31–21తో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇతర మహిళల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఇండియన్ రైల్వేస్ 37–19తో ఢిల్లీపై, ఉత్తర్‌ప్రదేశ్ 45–12తో ఒడిశాపై, పంజాబ్ 33–19తో బిహార్‌పై, ఛత్తీస్‌గఢ్ 27–23తో కర్ణాటకపై, హరియాణా 31–22తో చండీగఢ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 24–21తో తమిళనాడుపై, మహారాష్ట్ర 41–21తో పశ్చిమ బెంగాల్‌పై విజయం సాధించాయి. -
తెలంగాణ జట్ల నిష్క్రమణ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పురుషుల, మహిళల జట్లు లీగ్ దశలోనే నిష్క్రమించాయి. మహిళల జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచే గెలుపొందగా... రెండింట ఓడింది. పురుషుల జట్టు ఒక్కో గెలుపు, ఓటమిలతో పాటు మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అయితే పాయింట్ల సగటులో వెనుకబడటంతో నాకౌట్‌కు అర్హత సంపాదించలేకపోయింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ఆంధ్రప్రదేశ్... ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన రసవత్తర పోరులో ఒక్క పాయింట్ తేడాతో గెలుపొందింది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 44–43తో విజయాన్ని దక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఉత్తరాఖండ్ 51–23తో పంజాబ్‌పై, రాజస్తాన్ 45–43తో జార్ఖండ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 44–18తో బీఎస్ఎన్ఎల్పై, బిహార్ 39–27తో తమిళనాడుపై, ఒడిశా 49–39తో అస్సాంపై, గుజరాత్ 44–37తో పాండిచ్చేరిపై, పంజాబ్ 60–15తో త్రిపురపై, బిహార్ 45–43తో చండీగఢ్‌పై, బీఎస్ఎన్ఎల్ 41–34తో మణిపూర్‌పై, రైల్వేస్ 45–15తో ఆంధ్రప్రదేశ్‌పై, మహారాష్ట్ర 68–20తో గుజరాత్‌పై విజయం సాధించాయి. మహిళల మ్యాచ్‌ల ఫలితాలు: హరియాణా 65–10తో పాండిచ్చేరిపై, ఉత్తరప్రదేశ్ 27–26తో పశ్చిమ బెంగాల్‌పై, కేరళ 17–13తో పంజాబ్‌పై, కర్ణాటక 20–19తో చండీగఢ్‌పై, హిమాచల్‌ప్రదేశ్ 39–21తో ఢిల్లీపై, గుజరాత్ 35–11తో ఉత్తరాఖండ్‌పై, మధ్యప్రదేశ్ 54–27తో జార్ఖండ్‌పై గెలుపొంది ముందంజ వేశాయి. -
తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ తొలిరోజు తెలంగాణ జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ పోటీల్లో పురుషుల జట్టు గెలుపొందగా, మహిళల జట్టు పరాజయం పాలైంది. పురుషుల విభాగంలో తెలంగాణ 46–19తో చండీగఢ్‌పై ఘనవిజయం సాధించింది. బిహార్‌తో జరిగిన మరో మ్యాచ్‌ను 32–32తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి 21–12తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న తెలంగాణ చివరివరకు తమ జోరును కొనసాగించలేకపోయింది. రెండో అర్ధభాగంలో పుంజుకున్న బిహార్ అద్భుతంగా పోరాడి పరాజయం నుంచి తప్పించుకుంది. మహిళల విభాగంలో తెలంగాణ 16–21తో పశ్చిమ బెంగాల్ చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో కర్ణాటక 75–9తో విదర్భపై, కేరళ 49–35తో ఒడిశాపై, గుజరాత్ 48–26తో జమ్మూ కశ్మీర్‌పై, ఏపీ 50–18తో పశ్చిమ బెంగాల్‌పై, ఢిల్లీ 55–32తో జార్ఖండ్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 48–17తో బీఎస్ఎన్ఎల్పై, రాజస్తాన్ 42–38 తో ఢిల్లీపై, మధ్యప్రదేశ్ 56–17తో త్రిపురపై, ఉత్తర్‌ప్రదేశ్ 38–17తో మణిపూర్‌పై, హరియాణా 42–22తో కేరళపై విజయం సాధించాయి. మహిళల మ్యాచ్‌ల వివరాలు తమిళనాడు 45–28తో మణిపూర్‌పై, ఛత్తీస్‌గఢ్ 61–12తో పాండిచ్చేరిపై, బిహార్ 53–17తో జమ్మూ కశ్మీర్‌పై, కేరళ 31–19తో మధ్యప్రదేశ్‌పై, కర్ణాటక 42–18తో విదర్భపై, మహారాష్ట్ర 77–19తో గుజరాత్‌పై, ఉత్తర్‌ప్రదేశ్ 57–17తో అస్సాంపై, పంజాబ్ 64–34తో జార్ఖండ్‌పై, హిమాచల్ ప్రదేశ్ 38–32తో రాజస్తాన్‌పై, బిహార్ 31–15తో ఏపీపై నెగ్గాయి.. -
జాతీయ కబడ్డీ టోర్నీ షురూ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్దన్ సింగ్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో ప్రొ కబడ్డీ లీగ్ క్రీడాకారులు కూడా తలపడుతున్నారు. వీరితో పాటు 29 రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు పోటీపడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు మృదుల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపాటి గాంధీ, కిషన్ రెడ్డి, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కె. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కబడ్డీ అకాడమీ ప్రారంభం: కబడ్డీలో రాణించాలనుకునే నగర వాసులకు కబడ్డీ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ఆదివారం ప్రారంభమైంది. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ జ్ఞాపకార్థం బాచుపల్లిలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకునే క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తమైన ఈ అకాడమీని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జేఎస్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ రేపటి నుంచి ఆరు రోజుల పాటు నగర అభిమానులను అలరించనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఈ పోటీలు జరుగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. శుక్రవారం ఒలింపిక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కబడ్డీ టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని నేడు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్ర జట్ల వివరాలు పురుషులు: ఎం. మహేందర్ రెడ్డి (కెప్టెన్), జి. మల్లేశ్, జి. జీవా, ఎస్. భాస్కర్, సామ నిరీక్షణ్ రెడ్డి, ఎస్కే అమీర్, కె. శివయ్య, ప్రదీప్, ఎస్. కిషోర్, మునీశ్ కుమార్, కె. రవీంద్ర రమేశ్, భరత్ జాదవ్, ఎ. గౌరీ శంకర్, లక్ష్మీనారాయణ, కె. జగ్మోహన్ (చీఫ్ కోచ్), ఎస్. వెంకటేశ్ (కోచ్), ఎ. గౌరీ శంకర్ (మేనేజర్) మహిళలు: కె. మహేశ్వరి (కెప్టెన్), ఆర్. అఖిల, షేక్ నౌషీన్, కె. ప్రియాంక, మొహమ్మద్ సనా, బి. ప్రవళిక, వి. మౌనిక, ఆర్. కవిత, కె. మౌనిక, పి. సౌందర్య, టి. కావేరి, జి. ఆదిలక్ష్మి, ఎం. రేణుక, రత్నకుమారి, ఎన్. సుధాకర్ రావు (కోచ్), పి. సతీశ్ కుమార్ (మేనేజర్). -
31నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 31నుంచి జనవరి 5వ తేదీ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టోర్నీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి టోర్నమెంట్ ట్రోఫీలను ఆవిష్కరించారు. పురుషుల, మహిళల విభాగంలో జరిగే ఈ పోటీలకు 1500మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. 29 రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ, ప్రొ కబడ్డీ లీగ్ క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్లో తలపడతారని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని శనివారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. సర్వీసెస్, రైల్వేస్, బీఎస్ఎన్ఎల్ జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఆరు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింథటిక్ కబడ్డీ మ్యాట్లపై లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి నాకౌట్ పోటీలు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆదివారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు. -
కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి
రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం జాతీయ స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభ కార్యక్రమంలో అపశృతి దొర్లింది. ప్రమాదవశాత్తు గ్యాలరీ కూలింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రేక్షకులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురికి కాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తెలుగు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు.