31నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ | Kabaddi championship starts from 31st december | Sakshi
Sakshi News home page

31నుంచి జాతీయ కబడ్డీ టోర్నీ

Published Fri, Dec 29 2017 10:39 AM | Last Updated on Fri, Dec 29 2017 10:39 AM

Kabaddi championship starts from 31st december - Sakshi

జాతీయ కబడ్డీ టోర్నీ ట్రోఫీలను ఆవిష్కరిస్తున్న మంత్రి పద్మారావు, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 31నుంచి జనవరి 5వ తేదీ వరకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టోర్నీకి సంబంధించిన వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్, ‘శాట్స్‌’ చైర్మన్‌ ఎ. వెంకటేశ్వర్‌ రెడ్డి టోర్నమెంట్‌ ట్రోఫీలను ఆవిష్కరించారు.

పురుషుల, మహిళల విభాగంలో జరిగే ఈ పోటీలకు 1500మంది క్రీడాకారులు హాజరవుతారని నిర్వాహకులు చెప్పారు. 29 రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ, ప్రొ కబడ్డీ లీగ్‌ క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌లో తలపడతారని తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ తెలిపారు. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్‌ స్మారకార్థం బాచుపల్లిలో ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని శనివారం ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. సర్వీసెస్, రైల్వేస్, బీఎస్‌ఎన్‌ఎల్‌ జట్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నాయి. ఆరు రోజుల పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సింథటిక్‌ కబడ్డీ మ్యాట్‌లపై లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి నాకౌట్‌ పోటీలు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయని నిర్వాహకులు వెల్లడించారు. ఆదివారం జరిగే టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పద్మారావు గౌడ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement