
తెలుగు టైటాన్స్ లోగో ఆవిష్కరణ
ఆగస్టు 4 నుంచి 7 వరకు గచ్చిబౌలిలో ప్రొ కబడ్డీ లీగ్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆడే తెలుగు టైటాన్స్ జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ లీగ్ జులై 18 నుంచి ఆగస్టు 23 వరకు జరుగుతుంది.
ఇందులో తెలుగు టైటాన్స్ జట్టు ఆడే హోమ్ మ్యాచ్‌లు ఆగస్టు 4 నుంచి 7 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతాయి. టైటాన్స్ జట్టులో ఇద్దరు ఇరాన్ క్రీడాకారులతో పాటు ఒక కొరియన్ క్రీడాకారుడు ఉన్నారు. మిగిలిన వాళ్లంతా తెలుగు రాష్ట్రాల ఆటగాళ్లు. కబడ్డీకి తగిన ప్రోత్సాహం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోగో ఆవిష్కరణ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. జట్టు యజమాని శ్రీరామినేని శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.