
గంగూలీ తలకు గన్ పెట్టిన వేళ!
తొలి సిరీస్‌లో సౌరవ్ అనుభవం
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 1996 తొలి టెస్టు సిరీస్ మధుర జ్ఞాపకాలు పంచడమే కాదు, ఒక భయంకర అనుభవాన్ని కూడా మిగిల్చింది. ఇటీవల విడుదలైన ఒక పుస్తకంలో అతను నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఈ సిరీస్ మధ్యలో ఒకసారి గంగూలీ తన బంధువులను కలిసేందుకు కావెండిష్ నుంచి పిన్నార్‌కు లండన్ అండర్‌గ్రౌండ్ ట్రెయిన్ (ట్యూబ్)లో ప్రయాణించాడు. అతనితో పాటు మరో క్రికెటర్ సిద్ధూ కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్‌లో టీనేజర్లు అయిన ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల బృందం కూడా ఉంది. వారిలో బీరు తాగిన ఒకడు ఖాళీ క్యాన్‌ను వీరిపై విసిరేశాడు. అయితే దీనిని పట్టించుకోకుండా సౌరవ్, క్యాన్‌ను పక్కన పెట్టి సిద్ధూను కూడా వారించాడు. కానీ అక్కడితో ఆగని ఆ కుర్రాడు మాటల దాడి చేస్తూ వీరిపైకి దూసుకొచ్చాడు.
సౌరవ్ సంయమనం పాటించినా, సిద్ధూ వెనక్కి తగ్గకపోవడంతో గొడవ ముదిరింది. గంగూలీ కూడా ఏదైనా జరగనీ అన్నట్లుగా తానూ జత కలిశాడు. అయితే వారు ఊహించని విధంగా అటువైపు నుంచి స్పందన వచ్చింది. కింద పడ్డ ఆ కుర్రాడు ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి దాదా ముఖంపై గురి పెట్టాడు. ‘నా జీవితం ఇక్కడ ట్రెయిన్‌లోనే ముగిసిపోయింది అనుకున్నాను’ అని సౌరవ్ గుర్తు చేసుకున్నాడు. వీరి అదృష్టవశాత్తూ అదే టీమ్‌లో బాగా బలంగా ఉన్న అమ్మాయి వెంటనే సహచరుడిని వెనక్కి లాగింది. అప్పుడే స్టేషన్ రావడంతో అతడిని తీసుకపోవడంతో బతుకు జీవుడా అని గంగూలీ, సిద్ధూ బయట పడ్డారు. ఆ తర్వాత ఎప్పుడు ఇంగ్లండ్‌లో తిరగాలని అనిపించినా... సౌరవ్ సొంత కారులో డ్రైవింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు!