సొంత టి20ని పట్టించుకోని యూఏఈ
ఐపీఎల్‌పైనే అందరి దృషి
సాక్షి క్రీడావిభాగం
దుబాయ్‌లో రాయల్ చాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్‌ల మధ్య టి20 లీగ్ మ్యాచ్... రాయల్స్ తరఫున కమ్రాన్ అక్మల్, ఇమ్రాన్ నజీర్ చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు... అదేంటి? చాలెంజర్స్ అంటే మనకు క్రిస్ గేల్, కోహ్లి గుర్తుకొస్తారు కదా...అక్మల్ ఎక్కడినుంచి ఊడి పడ్డాడు అనుకుంటున్నారా! మీరు తప్పుగా చదవలేదు. జట్ల పేర్లు, ఆటగాళ్లు, టి20 మ్యాచ్ అంతా సరైందే.
మరి తేడా ఎక్కడుంది? ఇదంతా ఐపీఎల్ టోర్నీ కాదు. సరిగ్గా అదే పోలికలతో యూఏఈ బోర్డు నిర్వహిస్తున్న సొంత టి20 లీగ్. ఇప్పుడు ఐపీఎల్ మాయలో పడి అక్కడి అభిమానులంతా దీనిని పట్టించుకోవడం లేదు గానీ... గత ఏడాది ఈ లీగ్ అక్కడి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఈ ‘సూపర్ స్టార్స్ టి20’ లీగ్‌ను వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతున్న స్టేడియానికి కూతవేటు దూరంలో అకడమిక్ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన లీగ్ మే 17 వరకు జరుగుతుంది.
అంతా పాక్ ఆటగాళ్లే...
ఐపీఎల్‌లో అవకాశం దక్కని పాకిస్థాన్ క్రికెటర్ల దృష్టి ఈ లీగ్‌పై పడింది. ఇక్కడ ఆడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, షర్జీల్, నజీర్, జంషెద్, అసద్ షఫీఖ్, యాసిర్ అరాఫత్, అన్వర్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్...ఇలా పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఈ లీగ్ బరిలో ఉన్నారు. సహజంగానే పాక్ క్రికెటర్లు అక్కడి అభిమానులను ఆకట్టుకోగలరు కాబట్టి తొలి ఏడాది లీగ్ సక్సెస్ అయింది. విండీస్ ఆటగాడు ర్యాన్ హిండ్స్, అప్పట్లో వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే కొవెంట్రీ, అఫ్ఘన్ ఆటగాడు గుల్‌బదన్ తదితరులు పాల్గొంటున్నారు.
మొత్తం ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 65 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 10 లక్షల 83 వేలు). ఫైనల్లో విజేతకు 40 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 6 లక్షల 65 వేలు) దక్కుతాయి. మన ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. వీటితో పాటు కార్లు, బైక్‌లువంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఆటగాళ్లు గెలుచుకునే అవకాశం ఉంది. బరిలోకి దిగే క్రికెటర్లకు ఎంత మొత్తాలు ఇస్తారన్నది బహిరంగంగా వెల్లడించకపోయినా తాము సంతృప్తి పడే స్థాయిలో ఉన్నాయని క్రికెటర్లు చెప్పడం విశేషం.
పేర్లూ ఆసక్తికరమే...
సూపర్ స్టార్స్ టి20 టోర్నీలో యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలలోని నగరాలకు చెందిన పేర్లతో ఐపీఎల్‌ను పోలిన 16 జట్లు ఉన్నాయి. ప్రధానంగా యూఏఈలో స్థిరపడినవారిని దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు పెట్టుకున్నారు.
అహ్మదాబాద్ ఏసెస్, లాహోర్ గ్లాడియేటర్స్, అబుదాబి ఎంపరర్స్, కొచ్చి ఐలాండర్స్, హైదరాబాద్ నవాబ్స్, ఫైసలాబాద్ రేంజర్స్, సింగపూర్ స్ట్రైకర్స్, కాలికట్ టైగర్స్, ముంబై వారియర్స్, సియాల్‌కోట్ షార్క్స్, దుబాయ్ రాయల్స్, తెలిచెర్రి టైటాన్స్, ఢిల్లీ మొగల్స్, కరాచీ కింగ్స్, కొలంబో లయన్స్, గోవన్ కోబ్రాస్ పేరుతో జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీకి సమాంతరంగా ఐపీఎల్ జరుగుతుండటంతో కొంత కళ తప్పినా...యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇది కూడా మంచి వేదిక అని నిర్వాహకులు చెబుతున్నారు.
పొరుగింటి ‘తీపి’ కూర...
Published Fri, Apr 25 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:28 AM
Advertisement