'షుమాకర్ ఆరోగ్యంలో మెరుగుదల లేదు'
లండన్: గత మూడు సంవత్సరాల క్రితం స్కీయింగ్ చేస్తూ గాయపడి, ఆపై కోమాలోకి వెళ్లిన ఫార్ములా వన్ మాజీ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్యపరిస్థితిలో ఇంకా ఎటువంటి మెరుగుదల కనిపించలేదని ఫెరారీ మాజీ చీఫ్ లుకా డి మోన్ టేజ్ మోలో తెలిపారు. అతని ఆరోగ్యం ఎప్పటిలానే ఉండటం తమను మరింత ఆందోళనకు గురి చేస్తుందన్నారు. షూమాకర్ శరీరం నుంచి ఏ విధమైన స్పందనా పూర్తి స్థాయిలో కనిపించకపోవడం నిజంగా చెడు వార్తేనన్నారు.
అతనికి 1997లో జరిగిన ఫార్ములావన్ ప్రమాదాన్ని ఈ సందర్భంగా లుకా గుర్తు చేశారు. అతి పెద్ద ప్రమాదం కాకపోయినా, తమ తప్పిందవల్లే అప్పడు ఆ ప్రమాదం జరిగిందన్నారు. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే షూమాకర్ జీవితాన్ని స్కీయింగ్ పూర్తిగా చిన్నాభిన్నం చేసిందన్నారు. ఏడు సార్లు ఫార్ములావన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన షుమాకర్ కు ఇలా కావడం చాలా బాధకరమన్నారు. 2013 డిసెంబర్ లో ఫ్రెంచ్ ఆల్ప్స్ లో స్కీయింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కోమాలోకి జారుకున్న షూమాకర్ కు ఆరు నెలల పాటు ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం స్విట్జర్లాండ్ లోని అతనికి ఇంటికి తీసుకొచ్చి యథావిధిగా చికిత్స కొనసాగిస్తున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు.