పరువు కోసం..
►నేడు గుజరాత్‌తో ఢిల్లీ ఢీ
►ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి ఇరు జట్లు ఔట్
►పట్టికలో మెరుగైన స్థానం కోసం పోరు
కాన్పూర్: నాకౌట్ రేసు నుంచి ఇప్పటికే తప్పుకున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్, గుజరాత్ లయన్స్ జట్లు పరువు కోసం బుధవారం తలపడనున్నాయి. పంజాబ్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో గెలుపుబాట పట్టిన గుజరాత్ ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ముంబై చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకుని తిరిగి విజయాల బాట పట్టాలని ఢిల్లీ కృతనిశ్చయంతో ఉంది.
ఢిల్లీ ఆశలు గల్లంతు..
నాకౌట్ పోరుకు చేరుతామని ఆశించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆశలు ఆవిరయ్యాయి. సోమవారం ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించడంతో అధికారికంగా ప్లే ఆఫ్ రేసు నుంచి ఢిల్లీ వైదొలగాల్సి వచ్చింది. నిజానికి ఈ సీజన్‌లో ఢిల్లీ ఆటతీరు సాదాసీదాగా సాగింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడిన ఢిల్లీ నాలుగు విజయాలు, ఏడు పరాజయాలు నమోదు చేసింది. దీంతో పట్టికలో ఎనిమిది పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా 146 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు డోలాయమానంలో పడగా.. సోమవారం సన్‌రైజర్స్ విజయంతో నాకౌట్ ఆశలకు ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.
నిజానికి ముంబైతో మ్యాచ్‌లో ఢిల్లీ కనీస పోరాటం చేస్తుందని అభిమానులు ఆశించారు. ఎందుకంటే అంతకుముందు గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని మరో 21 బంతులుండగానే ఛేదించింది. దీంతో అభిమానులు మరోసారి అలాంటి ప్రదర్శనను ఆశించారు. అయితే అత్యంత అవమానకరరీతిలో 66 పరుగులతో ఐపీఎల్ టోర్నీలోనే తమ అత్యల్ప స్కోరును సమోదు చేసింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జట్టు తరఫున సంజూ శామ్సన్ అత్యధిక పరుగులు చేశాడు. 11 మ్యాచ్‌ల్లో 374 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ కూడా ఉండడం విశేషం. రిషబ్ పంత్ (281 పరుగులు), శ్రేయస్ అయ్యర్ (207 పరుగులు) ఆకట్టుకున్నారు. కరుణ్ నాయర్ , క్రిస్ మోరిస్, కోరీ అండర్సన్ ఫర్వాలేదనిపించారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే భారత దిగ్గజ బౌలర్ జహీర్‌ఖాన్ జట్టుకు నేతృత్వం వహిస్తున్నాడు. జట్టు తరఫున క్రిస్ మోరిస్ అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
తను 9 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్ (11 వికెట్లు), అమిత్ మిశ్రా (9), జహీర్ ఖాన్ (7), రబడ (6) ఫర్వాలేదపించారు. అయితే చివరి మూడు మ్యాచ్‌లకు రబడ, మోరిస్, ఏంజెలో మాథ్యూస్‌లు జట్టు నుంచి దూరం కావడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహంలేదు. వచ్చేనెలలో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల కోసం వీరంతా తమ జాతీయ జట్లతో చేరనున్నారు. మరోవైపు గుజరాత్‌తో గత సీజన్‌లో రెండు మ్యాచ్‌లాడగా అందులో చెరో మ్యాచ్‌లో ఇరుజట్లు విజయం సాధించాయి. అలాగే ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడగా ఏడు వికెట్లతో గుజరాత్‌పై ఢిల్లీ విజయం సాధించింది. మరోసారి అలాంటి ప్రదర్శనే నమోదు చేయాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఈ క్రమంలో చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగవచ్చని జట్టు భావనగా తెలుస్తోంది.
గుజరాత్ డీలా..
2016లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన గుజరాత్ లయన్స్ జట్టు ఈ సీజన్‌లో దుమ్మురేపింది. ఏకంగా మూడోస్థానంలో నిలిచి సత్తా చాటింది. అయితే ఈ సీజన్‌లో గుజరాత్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన రైనాసేన నాలుగు విజయాలు, ఎనిమిది పరాజయాలతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఎప్పుడో తప్పుకుంది. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడోస్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టికలో సాధ్యమైనంత మెరుగైన స్థానం కోసం పోరాడనుంది. మరోవైపు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో గుజరాత్ అద్భుత విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో 190 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే కెప్టెన్ సురేశ్ రైనా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
మొత్తం 12 మ్యాచ్‌లాడిన రైనా 434 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దినేశ్ కార్తీక్ (321 పరుగులు), బ్రెండన్ మెకల్లమ్ (229 పరుగులు), ఇషన్ కిషన్ (182) ఆకట్టుకున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో డ్వేన్ స్మిత్ ఫామ్‌లోకి వచ్చాడు. అయితే స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా తన ఆల్‌రౌండ్ ప్రదర్శనను కనబర్చాల్సి ఉంది. మరోవైపు గుజరాత్ బౌలింగ్‌లో పదును లోపించింది. ప్రత్యర్థి జట్లు అలవోకగా పరుగులు పిండుకుంటున్నాయి. దీనిపై జట్టు దృష్టి సారించాల్సి ఉంది. బౌలింగ్‌లో అండ్రూ టై 12 వికెట్లతో జట్టు తరపున అగ్రస్థానంలో నిలిచాడు. కేరళ స్పీడ్‌స్టర్ బాసిల్ థంప్సి ఆకట్టుకుంటున్నాడు. జేమ్స్ ఫాల్క్‌నర్, ప్రదవీప్ సాంగ్వాన్ రాణించాల్సి ఉంది. అయితే తొడ కండరాల గాయంతో మెకల్లమ్, పేసర్ టై జట్టు నుంచి దూరమవడం రైనాసేనను అందోళనపరుస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ చేతులో ఎదురైన ఓటమికి గుజరాత్ బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. పంజాబ్‌పై కనబర్చిన ఆటతీరునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాలని రైనాసేన కృతనిశ్చయంతో ఉంది.