' మరో' చరిత్ర | Uber Cup, India's medal for the second time in a row | Sakshi
Sakshi News home page

' మరో' చరిత్ర

Published Thu, May 19 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

' మరో' చరిత్ర

' మరో' చరిత్ర

వరుసగా రెండోసారి ఉబెర్‌కప్‌లో భారత్‌కు పతకం
సెమీస్‌కు చేరిన మహిళల జట్టు
రిత్విక శివాని సంచలన విజయం

 
తమ సంచలన ఆటతీరుతో భారత బ్యాడ్మింటన్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన మహిళలు మరోసారి అంతర్జాతీయ యవనికపై మెరిశారు. ఉబెర్‌కప్ బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండోసారి పతకం ఖాయం చేసుకుని మరోసారి చరిత్ర సృష్టించారు. తెలుగు తేజం రిత్విక శివాని సంచలన విజయం సాధించడంతో... థాయ్‌లాండ్‌ను ఓడించి భారత్ సెమీస్‌కు చేరింది. ఒకవేళ సెమీస్‌లో ఓడినా కనీసం కాంస్యం లభిస్తుంది.
 
కున్‌షాన్ (చైనా): ఎదురుగా తనకంటే మెరుగైన ప్రత్యర్థి... ఓడిపోతే తర్వాతి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో తెలియదు... తీవ్ర ఒత్తిడిలో తెలుగమ్మాయి రిత్విక శివాని చెలరేగి ఆడింది. ప్రపంచ 25వ ర్యాంకర్‌పై 19 ఏళ్ల శివాని సంచలన విజయం సాధించి భారత్‌ను ఉబెర్‌కప్‌లో సెమీస్‌కు చేర్చింది. గురువారం జరిగిన క్వార్టర్స్ పోరులో సైనా ఓడిపోయినా... భారత్ 3-1తో థాయ్‌లాండ్‌పై గెలిచి సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీస్‌లో భారత జట్టు చైనాతో తలపడుతుంది. 2014లో జరిగిన గత టోర్నీలోనూ భారత్ సెమీస్‌కు చేరి జపాన్ చేతిలో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.


 సైనా నిరాశ...
తొలి సింగిల్స్ ఆడిన ప్రపంచ 8వ ర్యాంకర్ సైనా నెహ్వాల్ 12-21, 19-21తో ప్రపంచ రెండో ర్యాంకర్ ఇంతనోన్ రత్చనోక్ చేతిలో ఓడటంతో భారత్‌పై ఒత్తిడి నెలకొంది. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా రెండో గేమ్‌లో కాస్త పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. రెండో సింగిల్స్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 10వ ర్యాంకర్ పి.వి.సింధు 21-18, 21-7తో బుసానన్ ఆంగ్‌బుమ్‌రాంగ్‌పాన్‌పై నెగ్గడంతో ఇరుజట్ల స్కోరు 1-1తో సమమైంది. 43 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ సత్తా మేరకు రాణించింది. ఇక తొలి డబుల్స్‌లో జ్వాల-అశ్విని జంట 21-19, 21-12తో పుటిటా సుపజిరాకుల్-సప్‌సైరి టెరాటనాన్‌చాయ్‌పై 39 నిమిషాల్లో నెగ్గి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపింది.


ఒత్తిడిని జయించి...
ఇక భారత్‌ను గెలిపించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్న ప్రపంచ 113వ ర్యాంకర్ రిత్విక కోర్టులో ఒత్తిడిని అద్భుతంగా జయించింది. ఫలితంగా 21-18, 21-16తో ప్రపంచ 25వ ర్యాంకర్ నిచాన్ జిందాపోల్‌పై సంచలన విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... ఆరంభంలో రిత్విక కాస్త ఇబ్బందిపడింది. కానీ గాడిలోపడిన తర్వాత ఊహించని రీతిలో షాట్లు కొడుతూ ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టింది. దీంతో తొలి గేమ్‌లో 5-5తో ఉన్న స్కోరును మెల్లగా 20-10కి పెంచుకుంది.

ఈ దశలో ప్రత్యర్థి వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని 20-18కి తగ్గించినా నెట్ వద్ద లో షాట్‌తో రిత్విక గేమ్‌ను సాధించింది. రెండో గేమ్‌లో ఒక్కో పాయింట్ కోసం హోరాహోరీ పోరాటం జరగడంతో చాలాసార్లు స్కోర్లు సమం అయ్యాయి. అయితే 16-16 ఉన్న దశలో రిత్విక వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ 3-1 ఆధిక్యంలో ఉండటంతో రెండో డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement