యూఎస్ వీసా నిరాకరణ..భారత ఆటగాళ్లకు షాక్
న్యూఢిల్లీ: ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్ ఈవెంట్లో పాల్గొననున్న భారత ఆటగాళ్లకు ఇక్కడి అమెరికా ఎంబసీ వీసా నిరాకరించింది. మొత్తం 30 మంది ఆటగాళ్లకుగాను 10 మందికి వీసా ఇచ్చింది. ఇందుకు నిరసనగా భారత్ ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని భారత్ ఆర్చర్ల సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్దేవా వెల్లడించాడు. దక్షిణకొరియా కోచ్ చే వోమ్ లిమ్ కూడా బాధితులలో ఒకరు. అండర్-20 విభాగంలో బాలికలు, బాలురు దక్షిణ దకోటాలోని యాంక్టన్ లో జరగనున్న పోటీలలో పాల్గొనాల్సి ఉండగా, ఈ విషయం వారికి షాకిచ్చింది. జూన్ 8 నుంచి 14 వరకు జరిగే ఈ ఈవెంట్కి భారత ఆర్చర్లు శనివారం అమెరికా బయలుదేరాల్సి ఉండగా ఎంబసీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఏడు మంది ఆర్చర్లకు, ఇద్దరు కోచ్లకు, మరోక సభ్యునికి వీసా సదుపాయాన్ని కల్పించింది. ముగ్గురు భారత్ కోచ్లు మిమ్ బహదుర్ గురుంగ్, చంద్రశేఖర లాగురీ, అవదేశ్లకు వీసా రాలేదు.
ఇంటర్వ్యూలో ఆటగాళ్ల సమాధానాలు సంతృప్తికరంగా లేనందున ఎంబసీ అధికారి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని భారత ఆర్చరీ సమాఖ్యకు చెందిన ఓ అధికారి వీరెందర్ సచ్డేవా తెలిపారు. ఆ ఆటగాళ్లు ఇండియాకి తిరిగి వస్తారో లేదోనని సందేహించాడని కూడా ఆయన చెప్పారు. కానీ చాలా మంది ఆర్చర్లు అస్సాం, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలవారే కావడం గమనార్హం. వారికి భావవ్యక్తీకరణ నైపుణ్యంతో పాటు, ఇంగ్లీష్ అంతగా రాదని వీరెందర్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో పర్యటించిన కోచ్ లిమ్ నిరాకరణకు గురవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని వీరేందర్ అన్నాడు. అమెరికా ఆర్చరీ సమాఖ్య ఆహ్వానం మేరకు, భారత ఆర్చరీ సంఘం ఎంపిక చేసిన ఆటగాళ్లను పంపినా ఇలా జరగడం బాధాకరమన్నాడు. యూఎస్ ఆర్చరీ సమాఖ్య సలహా మేరకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చిందని వీరెందర్ సచ్దేవా తెలిపాడు.