సెరెనా... సాధించెయ్! | US Open tournament from today | Sakshi
Sakshi News home page

సెరెనా... సాధించెయ్!

Published Mon, Aug 31 2015 12:00 AM | Last Updated on Fri, Aug 24 2018 5:21 PM

సెరెనా... సాధించెయ్! - Sakshi

సెరెనా... సాధించెయ్!

♦ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనతకు సదవకాశం
♦ అందరి దృష్టి అమెరికా స్టార్‌పైనే
♦ గత మూడేళ్లుగా చాంపియన్
♦ నేటి నుంచి యూఎస్ ఓపెన్ టోర్నీ
 
 న్యూయార్క్ : తన 17 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్‌లో సెరెనా విలియమ్స్ 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. ఇంతకాలం టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా, దిగకపోయినా ఆమెపై ఎలాంటి ఒత్తిడి ఉండకపోయేది. కానీ ఈసారి యూఎస్ ఓపెన్‌లో యావత్ క్రీడా ప్రపంచం దృష్టి 33 ఏళ్ల సెరెనాపైనే నెలకొని ఉంది. సెరెనా గెలుస్తుందా? ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ను పూర్తి చేస్తుందా? అరుదైన చరిత్రను సృష్టిస్తుందా? అని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

  ఈ ఏడాది జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో సెరెనా విజేతగా నిలిచింది. ఇక సోమవారం మొదలయ్యే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సెరెనాయే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత నాలుగేళ్లుగా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరుతున్న సెరెనా చివరి మూడేళ్లలో చాంపియన్‌గా నిలిచింది.

  భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం నాలుగున్నర గంటలకు మొదలయ్యే మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో వితాలియా దియత్‌చెంకో (రష్యా)తో సెరెనా తలపడుతుంది. ఈ టోర్నీలో నాలుగోసారి టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్న సెరెనా టాప్ సీడ్ హోదాలో దిగిన ప్రతిసారీ (2002, 2013, 2014) విజేతగా నిలువడం విశేషం.

  1999లో 17 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన సెరెనా ఈ టోర్నీలో 8సార్లు ఫైనల్‌కు చేరింది. స్థాయికి తగ్గట్టు ఆడితే సెరెనాకు ఈసారీ టైటిల్ దక్కడం ఖాయమనుకోవాలి. ‘డ్రా’ ప్రకారం సెరెనాకు సెమీస్‌లో షరపోవా (రష్యా) రూపంలో గట్టి సవాలు ఎదురయ్యే అవకాశముంది.

  ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సెరెనా తాను ఆడిన 50 మ్యాచ్‌ల్లో 48 మ్యాచ్‌ల్లో నెగ్గి, కేవలం 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ ఏడాది రోజర్స్ కప్‌లో సెమీస్‌లో బెన్సిచ్ (స్విట్జర్లాండ్), మాడ్రిడ్ ఓపెన్‌లో సెమీస్‌లో క్విటోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో మాత్రమే ఓటమి చవిచూసింది.

  ఒకవేళ సెరెనా ఈసారి చాంపియన్‌గా నిలిస్తే మూడు ఘనతలు సాధిస్తుంది. ఓపెన్ శకంలో (1968 తర్వాత) అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన స్టెఫీ గ్రాఫ్ (జర్మనీ) రికార్డును సమం చేయడంతోపాటు... 1989లో స్టెఫీ తర్వాత వరుసగా ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది. అదేవిధంగా టెన్నిస్ చరిత్రలో ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ పూర్తి చేసిన ఆరో ప్లేయర్‌గా నిలుస్తుంది.

  సెరెనా ఈ ఏడాది కచ్చితంగా యూఎస్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందనే నమ్మకంతో ఉన్న క్రీడాభిమానులు మహిళల సింగిల్స్ ఫైనల్ టికెట్లను ముందే బుక్ చేసుకున్నారు. ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ ఫైనల్‌కంటే ముందే మహిళల ఫైనల్ టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.

  ఈ ఏడాది యూఎస్ ఓపెన్ పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 33 లక్షల డాలర్ల (రూ. 21 కోట్ల 83 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభిస్తుంది.

 జొకోవిచ్ జోరు కొనసాగేనా!
 పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా)తోపాటు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఫేవరెట్స్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరిన జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిల్స్ సాధించగా... ఫ్రెంచ్ ఓపెన్‌లో వా వ్రింకా (స్విట్జర్లాండ్) చేతిలో ఓడి రన్నరప్‌గా సరిపెట్టుకున్నాడు.

  గతేడాది సం చలన ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచిన మారిన్ సిలిచ్ (క్రొయేషియా), రన్నరప్‌గా నిలిచిన కీ నిషికోరి (జపాన్) ఈ ఏడాది ఏం చేస్తారో వేచి చూడాలి. ఈ ఏడాది అంతగా ఫామ్‌లో లేని మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)ను కూడా తక్కువ అంచనా వేయలేం. అయితే నాదల్‌కు క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ రూపంలో పెను సవాలు ఎదురయ్యే అవకాశముంది. ఈ అడ్డంకిని దాటడంపైనే నాదల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement