వారెవ్వా... వాలెరి
వారెవ్వా... వాలెరి
Published Tue, Aug 13 2013 4:03 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM
మాస్కో (రష్యా): నాలుగు కేజీల బరువు ఉన్న ఆ ఇనుప గుండును రబ్బరు బంతి అనుకుందో ఏమోగానీ... న్యూజిలాండ్ విఖ్యాత షాట్‌పుట్ క్రీడాకారిణి వాలెరి ఆడమ్స్ మరోసారి తన అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరుసగా నాలుగోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఈ క్రమంలో 30 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఒకే క్రీడాంశంలో వరుసగా నాలుగు స్వర్ణాలు నెగ్గిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. సోమవారం జరిగిన మహిళల షాట్‌పుట్ ఫైనల్లో వాలెరి ఆడమ్స్ ఇనుప గుండును 20.88 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచింది. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 120 కేజీల బరువున్న వాలెరికిది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగో పసిడి పతకం కావడం విశేషం. 2007 (ఒసాకా), 2009 (బెర్లిన్), 2011 (డేగూ) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో... 2008 (బీజింగ్), 2012 (లండన్) ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన ఈ న్యూజిలాండ్ క్రీడాకారిణి అదే ఫలితాన్ని మాస్కోలోనూ పునరావృతం చేసింది.
Advertisement