తిరువనంతపురం : టీమిండియా మాజీ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ఎంఎస్ ధోనిపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడ జరిగిన చివరిదైన టీ20లో న్యూజిలాండ్‌పై నెగ్గి, సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. నేను వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైనా నన్ను విమర్శించరు. ఎందుకంటే నా వయసు 35 ఏళ్లు కాదు కదా. అదే సమయంలో ధోని విఫలమవడం, తక్కువ స్కోర్లు చేసినా విమర్శించడం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆటగాడు ఫిట్‌గా ఉన్నాడా, రాణిస్తున్నాడా లేదా అనేది కీలకమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని కూడా ఏదో ఓ రూపంలో విజయం కోసం పోరాడుతున్నాడు. కివీస్‌తో సిరీస్‌లలో ధోని రాణించలేదని విమర్శిస్తున్నారు కదా. ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశాలు తక్కువగా రావడం విఫలమవడానికి ఓ కారణం. అదే సమయంలో సాధించాల్సిన రన్‌రేట్ ఎంత ఉందన్నది ఆటగాడి ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కివీస్‌తో సిరీస్‌కు ముందు జరిగిన శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌లతో ధోని అద్భుతంగా రాణించాడన్న విషయాన్ని అప్పుడే పక్కన పెట్టేస్తే ఎలా?. టీ20 సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లలో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కు దిగిన స్థానంతో పాటు విజయానికి కావాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటం అతడి వైఫల్యానికి కారణం. మిడిల్, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లతో పోల్చితే టాపార్డర్ ఆటగాళ్లకే భారీ షాట్లు ఆడే అవకావం ఉంటుందని గమనించాలని’ కోహ్లీ వివరించాడు.
మరోవైపు ధోని వైఫల్యాలు కొనసాగుతున్నాయని, త్వరలో రిటైరయ్యి యువకులకు చోటివ్వాలంటూ భారత మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్‌లు సూచించగా... యువ ఆటగాడు హార్ధిక్ పాండ్యా సాధారణ బంతులకు ఔటైనా ఎందుకు నోరు మెదపడం లేదంటూ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చురకలంటించిన విషయం తెలిసిందే. తాజాగా కోహ్లీ సైతం ధోనికి మద్ధతు తెలుపుతూ వైఫల్యానికి గల కారణాలు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment