
ఐపీఎల్ బరిలోకి కోహ్లి..!
న్యూఢిల్లీ: గాయంతో ఐపీఎల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన రాయల్ చాలెంజర్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి త్వరలోనే మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో తాను బరిలోకి దిగే అవకాశముందని సామాజిక మాధ్యమం ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
సదరు వీడియోలో వెయిట్ లిఫ్టింగ్ క్లీన్ అండ్ జెర్క్‌ను సాధన చేసిన కోహ్లి.. తాను గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నట్లు సూచించాడు. మైదానంలోకి అడుగుపెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నానని పేర్కొన్న కోహ్లి.. ఈనెల 14 బరిలోకి దిగడానికి రంగం సిద్ధమైందని పోస్ట్ చేశాడు. గతనెలలో ఆసీస్‌తో మూడో టెస్టుమ్యాచ్ సందర్భంగా కోహ్లి భుజానికి గాయమైన సంగతి తెలిసిందే.
ఉమేశ్ కూడా...: మరోవైపు పేస్ బౌలర్ ఉమేశ్ యాదవ్ కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మంగళవారం జట్టుతో చేరిన అతను ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. కోల్‌కతా గురువారం పంజాబ్‌తో తమ తర్వాతి మ్యాచ్ ఆడుతుంది.